Share News

తిరుచానూరుకు కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:36 AM

జిల్లాలోని తిరుచానూరు వద్ద సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రేణిగుంట, తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధులను విభజిస్తూ ఈనిర్ణయం తీసుకుంది.

తిరుచానూరుకు కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

- రేణిగుంట, తిరుపతి రూరల్‌ పరిధి నుంచి విభజన

- 22 పంచాయతీలతో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

- మే నెలలో సేవలు అందుబాటులోకి?

- ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి

జిల్లాలోని తిరుచానూరు వద్ద సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రేణిగుంట, తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధులను విభజిస్తూ ఈనిర్ణయం తీసుకుంది. తిరుపతి రూరల్‌, రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోని 22 కీలక పంచాయతీలను విడదీసి కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటుకానుంది. మే నెలలో సేవలు అందుబాటులోకి రానున్నట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. తిరుచానూరులో కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటుకానుందని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. 22 పంచాయతీలతో కొత్త కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వంకు చేరాయని, త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఈనెల 9వ తేదీనే ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది.

సత్వర సేవలు

జిల్లా పరిధిలో ప్రధానంగా రేణిగుంట, తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రోజురోజుకూ పెరుగుతున్న రిజిస్ట్రేషన్లతో తీవ్ర రద్దీని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌లు అవసరమన్న ప్రతిపాదనలు గతంలో ఉన్నాయి. అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిన రేణిగుంటలో ఇద్దరిని పెట్టడం కన్నా తిరుచానూరు కేంద్రంగా కొత్త ఎస్‌ఆర్‌ కార్యాలయం ఏర్పాటుచేస్తే ప్రజలకు సత్వరమే సేవలందించేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావించింది. ఆమేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

కొత్త ఎస్‌ఆర్‌ కార్యాలయ గ్రామాలివే

కొత్తగా ఏర్పడే తిరుచానూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కోసం రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోని తిరుచానారు, దామినేడు, యోగిమల్లవరం(3 గ్రామాలు), తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోని వేమూరు, పానకం, బ్రాహణపట్టు, కొత్తూరు, ముండ్లపూడి, పూడి, తనపల్లె, కుంట్రపాకం, నల్లమనికల, కేసీ పేట, పత్తిపుత్తూరు, పచికాల, కాయం, టీసీ అగ్రహారం, కల్లూరు, తట్నేరి, శ్రీనివాసపురం, పాదిరేడు అరణ్యం, అయ్యన్నగారిపల్లె (19 గ్రామాలను)లను చేర్చనున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు తమ రిజిస్ట్రేషన్‌ అవసరాల కోసం సమీపంలోనే సేవలు పొందే అవకాశం కలగనుంది. కొత్త కార్యాలయ పర్యవేక్షణ బాధ్యతలను తిరుపతి జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీరామ్‌కుమార్‌కు అప్పగించారు.

Updated Date - Apr 17 , 2026 | 12:36 AM