తిరుచానూరులో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం!
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:10 AM
తిరుపతి బాలాజీ రిజిస్ట్రేషన్ పరిధిలో మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. తిరుచానూరు కేంద్రంగా కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవసరమన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి.
రేణిగుంట, తిరుపతి రూరల్ రిజిస్ట్రేషన్ల రద్దీకి చెక్
కీలకంగా మారనున్న కొత్త ఎస్‌ఆర్ కార్యాలయం
తిరుపతి సిటీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):తిరుపతి బాలాజీ రిజిస్ట్రేషన్ పరిధిలో మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. తిరుచానూరు కేంద్రంగా కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవసరమన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. తిరుపతి రూరల్ మండలం, రేణిగుంట మండలంలోని 22 కీలక పంచాయితీలను విడదీసి మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకానుంది. తిరుపతి జిల్లా పరిధిలో ప్రధానంగా రేణిగుంట, తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పెరుగుతున్న రిజిస్ట్రేషన్లతో తీవ్రరద్దీని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అవసరమన్న ప్రతిపాదనలున్నాయి. అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిన రేణిగుంటలో ఇద్దరిని పెట్టడం కన్నా తిరుచానూరు కేంద్రంగా కొత్త ఎస్‌ఆర్ కార్యాలయం ఏర్పాటుచేస్తే ప్రజలకు సత్వరమే సేవలందించేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు జిల్లా రిజిస్ట్రార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.
రేణిగుంట - తిరుపతి రూరల్ ప్రాంతాలకు చేరువలో సేవలు
రేణిగుంట, తిరుపతి రూరల్ మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రధాన పంచాయతీలను తిరుచానూరు పరిధిలోకి తీసుకురావడం ద్వారా దూరప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. తిరుచానూరుతో పాటు దగ్గరగా ఉన్న దామినేడు, వడమాలపేట, పూడి పరిధిలోని 19 గ్రామాలు, తిరుపతి రూరల్‌లోని కొన్ని పంచాయితీలతో కొత్త కేంద్రం ఏర్పాటుకానుంది. దీంతో రేణిగుంట, తిరుపతి రూరల్ ఎస్‌ఆర్ కార్యాలయాలకన్నా తిరుచానూరు కీలకమైన కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది.
త్వరలో నిర్ణయం
భూముల కొనుగోలు, అమ్మకాల కోసం తరచూ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆశ్రయించే రైతులు, మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. సమయం, ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంది. కొత్త కార్యాలయ ఏర్పాటుపై రెవెన్యూ శాఖ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధ్యయనం ప్రారంభించింది. పరిధి పునర్విభజన, కార్యాలయ స్థలం ఎంపిక వంటి అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో త్వరలోనే తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.