నేత్రపర్వం......శివయ్య ధ్వజారోహణం
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:03 AM
శ్రీకాళహస్తీశ్వరా లయ శివరాత్రి ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన స్వామివారి ధ్వజారోహణం బుధవారం భక్తుల మధ్య నేత్రపర్వంగా సాగింది.బుధవారం ఉదయం స్వామి,అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరా లయ శివరాత్రి ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన స్వామివారి ధ్వజారోహణం బుధవారం భక్తుల మధ్య నేత్రపర్వంగా సాగింది.బుధవారం ఉదయం స్వామి,అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవవిగ్రహాలకు హారతులు సమర్పించి ఊరేగింపు ప్రారంభించారు.శివయ్య గోపురం, రాజగోపురం మీదుగా దేవాంగవాహనాల వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చాక వెండి అంబారి వాహనంపై ఆశీనులను చేశారు.పరివార దేవతామూర్తులతో వస్తున్న పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అంబారి సేవ తరువాత దర్భ, మామిడాకులు, ధవళపతాకాన్ని చతుర్మాడ వీధుల్లో కొలువైన నవసంధి వినాయకాలయాల వద్దకు పండితులు తీసుకువచ్చి పూజలు చేశారు. అనంతరం దర్భను ఆలయంలోకి చేర్చారు. స్వామివారి సన్నిధి ఎదురుగా ఉన్న స్వర్ణతాపడ ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను, పరివార దేవతలను కొలువుదీర్చారు.ధ్వజస్తంభానికి ధర్భధారణ చేశారు.అనంతరం భక్తులు సమర్పించిన కొడి చీరలు,ధవళపతాకం, మామిడి ఆకులు ధ్వజస్తంభానికి ఎగురవేసి దేవతలకు ఆహ్వానం పలికారు.అనంతరం స్వామి అమ్మవార్లను వెండి అంబారిపై అధిష్టించి పురవీధుల్లో ఊరేగించారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప స్వామి అమ్మవార్లను అనుసరించారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్,ధర్మకర్తలమండలి సభ్యులు,ఈవో బాపిరెడ్డి,ఆలయ అధికారులు,టీడీపీ నాయకులు పాల్గొన్నారు.