Share News

ఆత్మనిర్భర్‌.. కాణిపాకం

ABN , Publish Date - May 13 , 2026 | 12:14 AM

జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జిల్లాకు మరోసారి రెండు అవార్డులు లభించాయి

ఆత్మనిర్భర్‌.. కాణిపాకం
కాణిపాకం పంచాయతీ కార్యాలయం

చిత్తూరు కలెక్టరేట్‌, మే 12(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జిల్లాకు మరోసారి రెండు అవార్డులు లభించాయి. ఆత్మ నిర్భర్‌ విభాగంలో ఐరాల మండలం కాణిపాకం పంచాయతీకి ద్వితీయ బహుమతి.. సంస్థల విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ రీసోర్స్‌ సెంటర్‌కు ప్రథమ బహుమతి దక్కాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో కుప్పానికి స్థానం లభించడం తెలిసిందే.

సొంత వనరులతో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శ పంచాయతీగా కాణిపాకం నిలిచింది. అందుకనే ఆత్మనిర్భర్‌ విభాగంలో ఈ పంచాయతీ ద్వితీయ బహుమతి కింద రూ.75 లక్షలను దక్కించుకుంది. ఈ పంచాయతీ జనాభా 3278. కుటుంబాలు 850. వ్యవసాయమే జీవనాధారం. ఆదాయ సేకరణ, వ్యయ నిర్వహణ, పరిపాలన వ్యవస్థలో బలమైన సంస్థాగత సామర్థ్యాన్ని పంచాయతీ చూపించింది. రూ.13,68,640 ఆస్తి పన్ను.. రూ.3,21,930 నీటిఛార్జీలు, రూ.1,60,965 పారిశుధ్య పనులు, రూ.5,32,080 మార్కెట్‌ పన్ను, రూ.88,546 చెత్త పన్ను రూపేణా.. ఇతరత్రా పన్నుల కింద మరో రూ.1,32,470 వసూలైంది. ఇంకా స్టాంపు డ్యూటీ కింద రూ.89,546, లైసెన్స్‌ల రూపంలో రూ.31,550, విభిన్న వనరుల ద్వారా రూ. 6,75,890 వసూళ్లు జరిగింది. ఇలా పన్ను రూపేణా మొత్తం రూ.2,61,50,299, పన్నేతర ఆదాయ రూపంలో రూ.8,33,942 వసూలు చేశారు. జీవనోపాధి, సమాజ అభివృద్ధికి, బలమైన ఆర్థికసామర్థ్యాన్ని చూపిస్తూ రూ. 26150299 అభివృద్ధి పనులను వినియోగించారు. ఆదాయ ట్రాకింగ్‌ కోసం డిజిటల్‌ వ్యవస్థ చేపట్టారు. భూగర్భ డ్రైనేజీ, మెరుగైన పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, వీధిదీపాల వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. ఆర్థిక స్వయం సమృద్ధి పెంచుకుంటూ, ప్రభుత్వ గ్రాంట్లపై ఆధారపడటం తగ్గంచడం, మౌలిక సదుపాయాలకు స్థిరమైన నిధుల సమీకరణ ద్వారా ఇతర పంచాయతీలకు కాణిపాకం ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఆత్మనిర్భర్‌ (సొంత నిధుల అభివృద్ధి) విభాగంలో ద్వితీయ అవార్డును సాధించింది.

చిత్తూరు డీపీఆర్‌సీకి మొదటి స్థానం

జిల్లా పంచాయత్‌ రీసోర్స్‌ సెంటర్‌(డీపీఆర్‌సీ)కి సంస్థల విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. ఈ అవార్డు కింద కేంద్రం రూ.కోటి నజరానా ప్రకటించింది. ‘పంచాయత్‌ క్షమతా నిర్మాణ్‌ సర్వోత్తమ్‌’ విభాగం ద్వారా నాలుగు రాష్ట్రాల నుంచి నాలుగు డీపీఆర్‌సీలు ఎంపిక కాగా.. అందులో చిత్తూరు డీపీఆర్‌సీ ప్రఽథమ స్థానం పొందింది. ఈ డీపీఆర్‌సీకి ప్రిన్సిపాల్‌గా జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, వైస్‌ ప్రిన్సిపాల్‌గా డీపీవో సుధాకర్‌రావు వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పన్నులు, పన్నేతర వసూళ్లలో గణనీయ అభివృద్ధిని సాధించడం ద్వారా ప్రథమ స్థానంలో నిలిపారు.

Updated Date - May 13 , 2026 | 12:14 AM