పీలేరులో పట్టు నిలుపుకున్న నల్లారి!
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:26 AM
మండల పరిషత్ ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి తన పట్టును నిలుపుకున్నారు. నియోజకవర్గంలోని పీలేరు, కేవీపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గడిచిన రెండున్నరేళ్లలో కాసింత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించిన చాలా మంది అభిప్రాయాలను తలకిందులు చేస్తూ ఆరు జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఆరుకు ఆరు జడ్పీటీసీ స్థానాల్లో విజయఢంకా
11 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు కైవసం
పీలేరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి తన పట్టును నిలుపుకున్నారు. నియోజకవర్గంలోని పీలేరు, కేవీపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గడిచిన రెండున్నరేళ్లలో కాసింత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించిన చాలా మంది అభిప్రాయాలను తలకిందులు చేస్తూ ఆరు జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అందునా తన చిరకాల ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(వైసీపీ) సొంత మండలమైన వాల్మీకిపురంలోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం ఆయనకు మరింత అనుకూలించే అంశం. కేవీపల్లె మండలం మినహా అన్ని మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయ తీరాలకు చేరారు. కేవీపల్లెలో మాత్రమే వైసీపీ అభ్యర్థి నుంచి టీడీపీ అభ్యర్థికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇక నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏడింట విజయం సాధించారు. మూడుచోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. మరో స్థానంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి సైతం టీడీపీ రెబల్ అభ్యర్థి కావడం గమనార్హం. నియోజకవర్గంలో మొత్తం 82 ఎంపీటీసీ స్థానాలుండగా 71 స్థానాలు టీడీపీకి ఏకగీవ్రమయ్యాయి. ఎన్నికలు జరిగిన 11 స్థానాల్లో ఏడింటిని చేజిక్కించుకుంది.
కలకడలో స్వతంత్ర అభ్యర్థి సంచలన గెలుపు
కలకడ మండలం గంగాపురం స్థానం నుంచి టీడీపీ నుంచి బహిష్కృత నేత అయిన ఆనంద నాయుడు సతీమణి లావణ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి సంచలన విజయం సాధించారు. టీడీపీకి చెందిన ఎంపీపీ అభ్యర్థి అయిన పి.మాధవిపై 481 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని జడ్పీటీసీ స్థానాల కంటే గంగాపురం ఎన్నిక అందరిలోనూ ఆసక్తి రేపింది.
వాల్మీకిపురంలోనూ పసుపు జెండా రెపరెపలు
వాల్మీకిపురం జడ్పీటీసీ స్థానాన్ని సైతం టీడీపీ కైవసం చేసుకోవడం పట్ల నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. మండల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి వాల్మీకిపురం మండలంలో చింతల రామచంద్రారెడ్డి వర్గీయులే వరుసగా గెలుస్తూ వచ్చారు. తొలిసారిగా జడ్పీటీసీ టీడీపీ ఖాతాలో పడింది. టీడీపీ అభ్యర్థి కె.లక్ష్మీదేవి, వైసీపీ అభ్యర్థి జి.శ్రీదేవిపై 1,532 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతే కాకుండా వాల్మీకిపురం ఎంపీపీ స్థానం సైతం ఇదివరకే టీడీపీ చేతికి చిక్కింది.