ఇక్కడ హంతకులు..అక్కడ జీవిత ఖైదీ
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:53 AM
చిత్తూరు రూరల్ మండలం మంగాపురంలో ఆగస్టు 8వ తేది రాత్రి ఒక ఇంట్లో కాపలాదారు హత్య జరిగింది. నాటుబాంబు వేసి ఇంటి గ్లాస్ డోర్ పగలగొట్టారు. దోపిడీకి వచ్చారా.. హత్యకోసం వచ్చి దొంగతనం కలరింగ్ ఇచ్చారా.. ఇంతకీ దుండగులు ఎవరు?
55 రోజులు దాటినా క్లూ దొరకలేదు
చిత్తూరు రూరల్ మండలం మంగాపురంలో ఆగస్టు 8వ తేది రాత్రి ఒక ఇంట్లో కాపలాదారు హత్య జరిగింది. నాటుబాంబు వేసి ఇంటి గ్లాస్ డోర్ పగలగొట్టారు. దోపిడీకి వచ్చారా.. హత్యకోసం వచ్చి దొంగతనం కలరింగ్ ఇచ్చారా.. ఇంతకీ దుండగులు ఎవరు?
పలమనేరు పట్టణంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ సూరి ఆగస్టు 9వ తేది సాయంత్రం తప్పించుకున్నాడు. వార్డర్ల కళ్లుగప్పి ఎలా వెళ్లాడు? ఎవరి సహకారంతో.. ఎక్కడికి చేరాడు?
ఒక రోజు వ్యవధిలో ఈ రెండు ఘటనలు జరిగాయి. 55 రోజులు దాటినా హంతకులు.. జీవిత ఖైదీ దొరకలేదు. క్లూ లభించలేదన్నది పోలీసుల మాట.
సూరి.. ఎక్కడున్నాడో?
పలమనేరులోని జైళ్ల శాఖ నిర్వహిస్తున్న ఐవోసీఎల్ పెట్రోలు బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్.సూర్య అలియాస్ సూరి(34) ఆగస్టు నెల 9వ తేది సాయంత్రం పరారయ్యాడు. ఈ విషయాన్ని సహ ఖైదీలు గుర్తించి అధికారులకు చెప్పారు. జైలు సూపరింటెండెంట్ ఎ.యూనస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికీ సూరి ఎక్కడున్నాడో.. ఆచూకీ దొరకలేదు. ఇతడిది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం నందనం గ్రామం. 2017 మే ఒకటో తేదిరాత్రి రాత్రి గజేంద్ర అనే వ్యక్తిని హత్యచేశాడన్న నేరంపై ఇతడిని పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు పంపారు. ఈ కేసులో విచారణ పూర్తయి నేరం రుజువు కావడంతో 2023 ఆగస్టు 9న శ్రీకాళహస్తి కోర్టు ఇతడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్పట్నుంచి జైలులో ఉన్న ఇతడిని పలమనేరులోని పెట్రోలు బంకులో విధి నిర్వహణకు నియమించారు. సాధారణంగా షార్ట్‌టర్మ్, లాంగ్ టర్మ్ ఖైదీలుగా ఉన్న వారి సత్ప్రవర్తనను బట్టి జైళ్లశాఖ ఇలా పనులకు పంపిస్తుంది. ఖైదీల నేరచరిత్ర, శిక్ష, జైలులో ఉన్నప్పుడు వారి ప్రవర్తన, అధికారులతో మాట్లాడేటప్పుడు మానసిక పరిస్థితులను అంచనా వేస్తారు. ఏ ఖైదీ అయితే సత్ప్రవర్తనతో ఉంటాడని భావిస్తారో.. అలాంటివారినే జైళ్లశాఖ నిర్వహించే పెట్రోల్ బంకులో పని కల్పిస్తారు. ఇలా జీవిత ఖైదీగా ఉన్న సూరిని ఐవోసీఎల్ పెట్రోల్ బంకులో పనికి పంపారు. రోజుకు రూ.200 వేతనం ఇస్తారు. ఒక పెట్రోల్ బంకులో ఐదారుగురు జీవిత ఖైదీలో పనిచేస్తున్నారనుకుంటే.. ఇద్దరు జైలు వార్డర్లతో నిఘా పెడతారు. ఖైదీలు పనికి వచ్చినప్పటి నుంచి డ్యూటీ ముగించుకుని వెళ్లే వరకు వార్డర్ల నిఘా ఉంటుంది. ఇంతటి పర్యవేక్షణ ఉన్నా పలమనేరులో జీవిత ఖైదీ తప్పించుకోగలిగాడు.
ఇప్పటికీ దొరకని ఆచూకీ
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జీవిత ఖైదీ సూరి స్వస్థలం, అతడి బంధువుల ఇళ్ల వద్ద సమాచారం సేకరించినా అతడి గురించి తెలియలేదు. ఏ కేసులోనైనా నిందితుడు వాడే సెల్‌ఫోన్ టవర్, కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఈ కేసులోనూ సూరి వినియోగించిన సెల్‌ఫోను టవర్ ఒంగోలు వరకే చూపిందని, తర్వాత లేదని పోలీసులు చెబుతున్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే.. జీవిత ఖైదీగా ఉన్న సూరికి ఎవరు సెల్‌ఫోను ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. ఇక, యూనిఫారంలో ఉన్నప్పుడు తప్పించుకొని పారిపోయే అవకాశాలు తక్కువని పోలీసులు అంటున్నారు. అంటే స్థానికంగానే సూరి ఎవరితోనైనా సఖ్యతతో మెలగుతూ వారి సహకారంతో పరారయ్యాడా.. వాళ్లే ఇతడికి వేరే దుస్తులు తీసిచ్చారా.. ఎవరికంటా పడకుండా ముందుగానే వాహనాన్ని సిద్ధం చేశారా? చివరకు ఎక్కడికి చేరాడు? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే. 55 రోజులు దాటుతున్నా ఇప్పటికీ అతడి ఆచూకీ దొరకలేదు. పెట్రోలు బంకు పరిసరాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారిందని చెబుతున్నారు.
- పలమనేరు, ఆంధ్రజ్యోతి