Share News

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:50 AM

: భర్త హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలించినట్లు ఎస్పీ ధీరజ్‌ చెప్పారు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య
నిందితులను అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు

మదనపల్లె క్రైం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): భర్త హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలించినట్లు ఎస్పీ ధీరజ్‌ చెప్పారు. బుధవారం స్థానిక పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఇ.రామిరెడ్డిగారిపల్లె పంచాయతీ చింతలవారిపల్లెకు చెందిన మంగినేని వెంకటసుబ్రహ్మణ్యం(45) కుటుంబం కొంతకాలంగా పీలేరు పట్టణంలోని డిష్‌ కాలనీలో నివాసం ఉంటోంది. సుబ్రహ్మణ్యం స్వగ్రామంలో రేషన్‌ డీలర్‌గా ఉన్నాడు. అతని భార్య ఎం.ఉమాదేవి(41) తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనబాకం గ్రామానికి చెందిన చారాల సుబ్రహ్మణ్యం(32)తో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. చంద్రగిరి సమీపంలోని గాదంకి టోల్‌గేట్‌లో వాహనాలకు స్టిక్కర్లు అంటించే పనులు చేస్తూ ఫేస్‌బుక్‌ ద్వారా ఉమాదేవికి పరిచయమయ్యాడు. దాంతో వీరిమధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. విషయం భర్తకు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే సుబ్రహ్మణ్యం వివాహేతర సంబంధానికి అడ్డొస్తుండటంతో అతన్ని అంతం చేయాలని ప్రియుడు, ప్రియురాలు కలసి పథకం పన్నారు. ఈనెల ఏడో తేదీ రాత్రి ఉమాదేవి భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. అతడు గాఢ నిద్రలోకి జారుకోవడంతో పథకం ప్రకారం ఇద్దరూ కలసి ఇనుపరాడ్‌, గుండ్రాయితో తల పగులగొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టుకుని ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి మదనపల్లె-తిరుపతి మార్గంలోని గూడరేవుపల్లె వద్ద జాతీయ రహదారిపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కేసునమోదు చేసిన పోలీసులు స్థానికులను, సుబ్రహ్మణ్యం కుమారుడు లోహిత్‌ను విచారించారు. వారు చెప్పిన వివరాల మేరకు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం అంగీకరించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుండటంతో హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో బుధవారం నిందితులను అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలించారు. అలాగే హత్యకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, గుండ్రాయి, ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పీలేరు సీఐ వెంకటేశ్వర్లును ఎస్పీ అభినందించి, రివార్డు అందజేశారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌, కలకడ సీఐ లక్ష్మన్న, ఎస్‌ఐ రహీం పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:50 AM