Share News

అదృశ్యమైన వృద్ధురాలి హత్య

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:05 AM

ఇటీవల అదృశ్యమైన వృద్ధురాలు హత్యకు గురైంది. నగల కోసం ఆమెను తీసుకెళ్లి హతమార్చినట్లు తెలిసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టు రట్టయింది. తాలూకా పోలీసుల కథనం మేరకు..

అదృశ్యమైన వృద్ధురాలి హత్య
లక్ష్మీదేవి(ఫైల్‌ ఫొటో)

- నగల కోసం హతమార్చిన దంపతులు

- పోలీసుల అదుపులో నిందితులు

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇటీవల అదృశ్యమైన వృద్ధురాలు హత్యకు గురైంది. నగల కోసం ఆమెను తీసుకెళ్లి హతమార్చినట్లు తెలిసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టు రట్టయింది. తాలూకా పోలీసుల కథనం మేరకు..మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీ వెంకప్పకోటకు చెందిన ఎన్‌.లక్ష్మీదేవి(83) ఆర్టీవో కార్యాలయం వద్ద చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. అదే పంచాయతీ పుంగనూరువాండ్లపల్లెకు చెందిన ప్రమీల, వినోద్‌ దంపతులు ఆర్టీవో కార్యాలయంలో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. లక్ష్మీదేవితో వారికి పరిచయం ఏర్పడింది. కుటుంబ అవసరాల నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఆమెను రూ.1.50లక్షలు అప్పు అడిగారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఊరకుండిపోయారు. అంతటితో ఆగకుండా వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేశారు. గతనెల 22న తాము బంధువుల నామకరణం ఫంక్షన్‌కు వెళ్తున్నామని, నువ్వు కూడా రావాలని పట్టుబట్టి ఆమెను కారులో తీసుకెళ్లారు. తిరుపతి సమీపంలోకి తీసుకెళ్లి పథకం ప్రకారం గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 40గ్రాముల బంగారు నగలు తీసుకుని రహదారి పక్కన గోతి తీసి అందులో మృతదేహాన్ని పూడ్చిపెట్టి వచ్చేశారు. సాయంత్రమైనా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. మృతురాలి కోడలు సుగుణ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్టీవో కార్యాలయం వద్ద స్థానికులను విచారించగా, ప్రమీల, వినోద్‌ ఆమెను కారులో తీసుకెళ్లినట్లు చెప్పారు. కార్యాలయ సిబ్బందిని ఆరా తీయగా వాచ్‌మెన్లు రెండుమూడు రోజులుగా విధులకు హాజరుకాలేదని చెప్పారు. పైగా వారి సెల్‌ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Updated Date - Sep 05 , 2026 | 01:05 AM