అడపారెడ్డి పల్లెలో హత్య
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:49 AM
తిరుపతి రూరల్ మండలం, దుర్గసముద్రం పంచాయతీ పరిధిలోని అడపారెడ్డిపల్లెలో ముమ్మిరెడ్డి అమరనాథ రెడ్డి (45) అనే వ్యక్తి ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు.
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్ మండలం, దుర్గసముద్రం పంచాయతీ పరిధిలోని అడపారెడ్డిపల్లెలో ముమ్మిరెడ్డి అమరనాథ రెడ్డి (45) అనే వ్యక్తి ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడు ఈ హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. వివరాల్లోకి వెళితే.... అమరనాథరెడ్డి ఎదురింటిలోనే రాహుల్ కుటుంబం ఉంటోంది. ఓ స్థల విషయమై కొంతకాలంగా వీరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ హత్యోదంతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అమరనాథ రెడ్డి బుధవారం రాత్రి మొదటి అంతస్తులోని వరండాలో పడుకుని ఉండగా 11 గంటల సమయంలో రాహుల్ ఇంటిలోకి చొరబడి మేడమీదికి చేరుకుని హత్యకు పాల్పడ్డాడు. మంచంపై పడుకునివున్న అమరనాథరెడ్డిని కత్తితో దారుణంగా నరకడంతో అతడి మెడ, ముఖంపై లోతైన గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. హత్య తరువాత రాహుల్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఇంట్లోంచి పరారయ్యారు. హతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రాహుల్ ఇంటి బయట పార్క్‌చేసి ఉంచిన రాహుల్ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. అలాగే రాహుల్ ఇంటి వరండాలోనూ సామానుకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అమరనాథరెడ్డి వర్గీయులను అడ్డుకుని శాంతపరిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పరారైన రాహుల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.