Share News

మున్సిపాలిటీ వారి హెచ్చరిక

ABN , Publish Date - May 11 , 2026 | 01:34 AM

ఇది అనధికార లే అవుట్‌ ఇక్కడ స్థలం కొనడం చట్టవిరుద్ధం పలమనేరులో బోర్డుల ఏర్పాటు

మున్సిపాలిటీ వారి హెచ్చరిక
పలమనేరులో అక్రమ లేఅవుట్‌ లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

ఇది అనధికార లేఅవుట్‌. ఇక్కడ స్థలం కొనుగోలు చేయుట చట్టవిరుద్ధం. ఇక్కడ భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయబడవు. దీనిని గమనించవలసిందిగా కోరడమైనది.

- ఇలాగని పలమనేరు మున్సిపల్‌ కమిషనరు పేరిట అనధికార లేఅవుట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

పలమనేరు, ఆంధ్రజ్యోతి: చెన్నె- బెంగళూరు జాతీయ రహదారి.. రెండు రాష్ట్రాలకు సరిహద్దు. చల్లటివాతావరణం. అందుకనే పలమనేరులో స్థిరపడేందుకు స్థానికేతరులు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నివేశ స్థలాలకు గిరాకీ పెరిగింది. దీన్ని దృష్టిటో ఉంచుకుని రియల్టర్లు దశాబ్దకాలంగా పలమనేరు చుట్టూ లే అవుట్లు వేశారు. వ్యవసాయ భూములను కొని నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విక్రయించుకొంటున్నారు. ఈ లేఅవుట క్రమబద్ధీకరణకు రియల్టర్లు ముందుకు రావడం లేదు. అందుకని ఈ అక్రమ లే అవుట్లలో రెండేళ్లుగా కమిషనరు రమణారెడ్డి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డిజిటల్‌ బోర్డులు పెట్టినా.. అక్రమ లే అవుట్లు వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా మార్పు రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లే అవుట్లపై చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పలమనేరులో మున్సిపల్‌ అధికారులు లేఅవుట్లపై విచారించారు. శ్రీనాథ్‌.. జేఎస్‌ నగర్‌.. రమాగార్డెన్స్‌ లే అవుట్లే అప్రూవ్‌ అయ్యాయని గుర్తించారు. 53.98 ఎకరాల మేర వ్యవసాయ భూముల్లో 36 లేఅవుట్లను రియల్టర్లు అక్రమంగా వేశారని అధికారులు తెలిపారు. కొన్ని లే అవుట్లలో 50 నుంచి 70 శాతం నివేశస్థలాలను విక్రయించేశారు. కొన్నయితే రెండు మూడు చేతులు మారాయి.

పదే పదే గడువు పొడిగింపులు

పలమనేరు పరిసరాల్లోని అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రహసనంగా మారింది. దశాబ్ద కాలంగా పలు మున్సిపాలిటీల్లో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వాలు గడువు ఇవ్వడం.. మళ్లీ గడువు పెంచుకొంటూ పోవడం.. అయినా రియల్టర్లు పట్టించుకోక పోవడం ఆనవాయితీగా మారింది. క్రమబద్ధీకరణ చేసుకోకపోయినా చర్యలు లేకపోవడంతో దీనికి రియల్టర్లు ముందుకు రావడం లేదన్నది అక్షర సత్యం. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని.. లేఅవుట్ల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకొంటే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అక్రమ లేఅవుట్ల వద్ద కొని ప్రజలు మోసపోకుండా ఉంటారు.

అక్రమ లే అవుట్లలో ఇల్లు కట్టాలంటే..

అక్రమ లే అవుట్లలో నివేశస్థలాలు కొని ఎవరైనా తప్పనిసరి పరిస్థితిలో ఇల్లు కట్టుకోవాలంటే.. మున్సిపాలిటీకి స్థలం కొనుగోలు ధరలో బెటర్మెంట్‌ చార్జీ కింద 14.5 శాతం (ఇప్పుడున్న ధరమేరకు) కట్టాలి. మున్సిపాలిటీ నిబంధనల మేరకు లే అవుట్లలో కనీసం లోపల రోడ్డు 35 అడుగుల వెడల్పు ఉండాలి. అక్రమ లే అవుట్లలో కేవలం 20 అడుగుల మేర రోడ్డుంటే మిగిలిన 15 అడుగులు నివేశస్థలం కొనుగోలుదారు తన స్థలం వదిలి.. మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలి. ఇక ఉద్యోగులైతే అక్రమ లే అవుట్‌లో ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంకులు రుణం ఇవ్వవు. అందువల్లే అక్రమ లే అవుట్లలో నివేశస్థలాలు కొనద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Updated Date - May 11 , 2026 | 01:34 AM