మున్సిపల్ ఫలితాలతో కూటమి పార్టీల్లో జోష్
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:14 AM
పంచాయతీ ఎన్నికల్లోనూ విజయం పునరావృతమయ్యేనా?
పుంగనూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లో విజయాల నేపథ్యంలో రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతుండగా, ఎన్నికల నిర్వహణకు అధి కారులు సన్నద్ధమవుతున్నారు. అయితే, గత ఎన్నికల ఫలితాలు పంచాయతీల్లోనూ పునరావృతమయ్యే అవకాశం పై విస్తృతంగా చర్చ నడుస్తోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఉన్న ఓటర్ల జాబితా మేరకు వార్డులు, పంచాయతీల్లో ఓటర్లు, కులాలు, బందువర్గాలు, పరిచయాలు తదితర అంశాలు బేరీజు వేసుకుని గెలుపు కోసం మంతనాలు సాగిస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతుండటంతో బ్యాలెట్‌పై రాజకీయ పార్టీల గుర్తులుండవు. ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారి, మండలాల్లో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక కేంద్రాలు, ఓటర్లుకు వసతులు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరులో 23 గ్రామపంచాయతీలు, చౌడేపల్లెలో 19, సోమలలో 15, సదుంలో 18 గ్రామపంచాయతీలుండగా చిత్తూరు జిల్లాలోని పులిచెర్లలో 25, రొంపిచెర్లలో 11 పంచాయతీలున్నాయి. కానీ పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లె, పాశంవారిపల్లె పంచాయతీలను వైసీపీ ప్రభుత్వంలో ఒకటే పంచాయతీగా చేయడంతో స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్‌లో ఉండటంతో గత పంచాయతీ, ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో రెండు చోట్ల ఎన్నికలు జరగవు. అలాగే రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లెను కూడా విడదీయడంతో స్థానికులు కోర్టును ఆశ్రయించగా గత ప్రభుత్వ చర్యలను కొట్టివేస్తూ ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో గతంలో జరగని బొమ్మయ్యగారిపల్లె పంచాయతీకి కూడా ఈసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
గత ఏడాది అన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాలే...
గత వైసీపీ పాలనలో పుంగనూరు నియోజకవర్గంలోని 111 గ్రామపంచాయతీలకు గానూ బొమ్మయ్యగారిపల్లె(రొంపిచెర్ల), పులిచెర్లలోని ఎల్లంకివారిపల్లె, పాశంవారిపల్లెల్లో మాత్రం కోర్టు స్టే వల్ల ఎన్నికలు జరగలేదు. మిగిలిన పుంగనూరులో 23, చౌడేపల్లెలో 19, సోమలలో 15, సదుంలో 18, పులిచెర్లలో 23, రొంపిచెర్లలో 11 పంచాయతీల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ వారిని నామినేషన్లు వేయనీయకుండా మొత్తం 108 పంచాయతీల్లో పెద్దిరెడ్డి అనుచరుల వైసీపీ శ్రేణులే సర్పంచ్, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పుంగనూరులో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో కూటమి పార్టీ నేతల్లో జోష్ నెలకొని ఎన్నికలపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే పలువురు కులధ్రువీకరణపత్రాలు, పంచాయతీల్లో నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంతో తలమునకలయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈసారి పంచాయతీ ఎన్నికలపై కూటమి పార్టీలు ఉత్సాహంగా ఉన్నాయి.