30చోట్ల ఎంపీపీ అభ్యర్థుల ఖరారు
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:35 AM
జిల్లావ్యాప్తంగా నేడు జరగనున్న ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.ఆయా మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 35 మండల పరిషత్‌లకు గానూ 33 మండలాల్లో ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది.అందులో 30 మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులెవరన్నది దాదాపుగా ఖరారైంది.ఒకరికి మించి ఆశావహులు ఎంపీపీ పదవిని ఆశిస్తుండడంతో మూడు మండలాల్లో బుధవారం
మూడు మండలాల్లో కుదరని ఏకాభిప్రాయం
తొట్టంబేడు కూటమిలో సమసిన వివాదం.. టీడీపీకే ఎంపీపీ సీటు
వెంకటగిరి, కేవీబీపురం వైసీపీ ఎంపీటీసీల్లో చీలిక.. టీడీపీకే ఎంపీపీ స్థానాలు?
తిరుపతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా నేడు జరగనున్న ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.ఆయా మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 35 మండల పరిషత్‌లకు గానూ 33 మండలాల్లో ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది.అందులో 30 మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులెవరన్నది దాదాపుగా ఖరారైంది.ఒకరికి మించి ఆశావహులు ఎంపీపీ పదవిని ఆశిస్తుండడంతో మూడు మండలాల్లో బుధవారం రాత్రి వరకూ ఎంపీపీ అభ్యర్థులు ఖరారు కాలేదు. కాగా కూటమి, వైసీపీ సగంసగం సీట్లు గెలిచిన వెంకటగిరి, కేవీబీపురం మండలాల్లో పరిస్థితులు కూటమికి అనుకూలించినట్టు సమాచారం. ఆ మండలాల్లో వైసీపీ ఎంపీటీసీల్లో చీలిక సంభవించిందని కనీసం ఒక ఎంపీటీసీ చొప్పున కూటమికి మద్దతు పలకనున్నట్టు తెలిసింది. దీంతో ఆ రెండు ఎంపీపీ పదవులు కూడా టీడీపీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓజిలి, వాకాడు మండలాల్లో టీడీపీకి మెజారిటీ ఎంపీటీసీలున్నా కూడా ఎంపీపీకి అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో వైసీపీ ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు జరిగాయి. అవేవీ ఫలించే పరిస్థితి కనిపించనందున నేడు జరిగే ఎంపీపీ ఎన్నికలను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే జిల్లాలోని 35 మండల పరిషత్‌ల అధ్యక్ష పదవుల్లో అన్నీ అనుకూలిస్తే టీడీపీకి 30, జనసేనకు ఒకటి, వైసీపీకి రెండు చొప్పున దక్కనున్నాయి.అయితే వైస్ ఎంపీపీల విషయంలో మాత్రం చాలా మండలాల్లో స్పష్టత లేదు.
మూడు మండలాల్లో తీవ్ర పోటీ
నారాయణవనం, నాగలాపురం, పెనగలూరు ఎంపీపీ పదవులకు ఆయా పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. కూటమి విషయానికొస్తే నారాయణవనం, నాగలాపురం ఎంపీపీ పదవులకు టీడీపీలో ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. నారాయణవనంలో వీకేపాలెం ఎంపీటీసీ శాంతకుమారి, కీలగరం ఎంపీటీసీ విజయ ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. నేతలు సర్దుబాటుకు యత్నిస్తున్నా బుధవారం రాత్రి వరకూ కూడా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. అలాగే నాగలాపురంలో ఎంపీపీ పదవి కోసం నాగలాపురం-1 ఎంపీటీసీ మోహనాంబల్, చిన్నాపట్టు ఎంపీటీసీ జ్యోతి గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో ఈ రెండు చోట్లా ఎంపీపీ అభ్యర్థిని ఖరారు చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. కాగా పెనగలూరు మండలంలో వైసీపీ మెజారిటీ సీట్లు సాధించింది. అక్కడ కూడా ఎంపీపీ పదవిని ఆ పార్టీలో ఎంపీటీసీలు చెంగల్‌రెడ్డి, పాగాల రమణయ్య ఆశిస్తుండడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. గురువారం ఉదయానికైనా ఈ మూడు చోట్లా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుందేమో చూడాల్సివుంది.
ఓజిలి, వాకాడుల్లో ఎన్నికల వాయిదాకు వ్యూహం
ఓజిలి, వాకాడు మండలాల్లో టీడీపీకి మెజారిటీ ఎంపీటీసీ సభ్యులున్నా ఎంపీపీ పదవులు సాధించలేని చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓజిలిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ 6, బీజేపీ ఒకటి చొప్పున కూటమి మొత్తం 7 స్థానాలు గెలిచింది. వైసీపీ కేవలం మూడు ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ ఎంపీపీ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వయింది. అయితే టీడీపీ, బీజేపీ తరపున ఏడుగురు ఎంపీటీసీలుగా గెలిచినా వారిలో ఎవరూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు లేరు. అదే సమయంలో వైసీపీ నుంచీ గెలిచిన ముగ్గురు ఎంపీటీసీలూ ఎస్సీలే. వైసీపీ నుంచీ గెలిచిన ముగ్గురిలో ఎవరో ఒకరిని తమవైపు లాక్కుని ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నా బుధవారం రాత్రి వరకూ సాధ్యపడలేదని సమాచారం. వైసీపీ నుంచీ గెలిచిన ముగ్గురూ ఎస్సీ అభ్యర్థులే కావడంతో ముగ్గురూ కూడా ఎంపీపీ పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలిసింది. దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయించడానికి టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సభ్యుల ప్రమాణ స్వీకారం, కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక వరకూ వుండి తర్వాత ఎంపీపీ ఎన్నిక సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక వాకాడు విషయానికొస్తే మొత్తం 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 6, వైసీపీ 5 చొప్పున గెలుచుకున్నాయి. ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వయింది.టీడీపీకి ఆరుగురు ఎంపీటీసీలున్నా వారిలో ఎస్సీ మహిళ లేరు. వైసీపీ నుంచీ గెలిచిన ఐదుగురిలో ఇద్దరు ఎస్సీ మహిళలున్నారు. దీంతో ఆ ఇద్దరిలో ఒకరిని టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నా వీలు కాలేదని సమాచారం. వెంకటగిరి వైసీపీ ఇంఛార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి వారు నమ్మకమైన అనుచరులు కావడంతో వారిలో ఒకరిని ఎంపీపీ చేయడానికి టీడీపీ నేతలు సైతం సుముఖంగా లేరని తెలిసింది. ఈ కారణంగా ఎంపీపీ ఎన్నికను ఏదో ఒక విధంగా వాయిదా వేయించాలని యత్నిస్తున్నారని సమాచారం.
ఎంపీపీలుగా అవకాశమున్న వారు వీరే!
టీడీపీకి సంబంధించి చిట్వేలి ఎంపీపీగా రాటకొండ కల్పన, ఓబులవారిపల్లెకు ముక్కా వికా్సరెడ్డి, వెంకటగిరికి తంబాకుల రాజేశ్వరి, డక్కిలికి పోలంరెడ్డి సుమతి, బాలాయపల్లెకు రావి వాణి, చిట్టమూరుకు చిన్నశేషయ్య, సూళ్ళూరుపేటకు బూదూరు రమణమ్మ, నాయుడుపేటకు నెలవల రాజేశ్, తడకు కన్నంబాకం లయ, దొరవారిసత్రానికి గోను జక్కరయ్య, పెళ్ళకూరుకు ఓజిలి అరుణకుమారి, సత్యవేడుకు జమునమ్మ, వరదయ్యపాలేనికి యుగంధర్‌రెడ్డి, బీఎన్‌కండ్రిగకు గంగమ్మ, పిచ్చాటూరుకు కామేశ్వరి, కేవీబీపురానికి మీనాక్షి, శ్రీకాళహస్తికి రవీంద్రనాఽథ రెడ్డి, తొట్టంబేడుకు కొన్నలి రమేష్, ఏర్పేడుకు కొంగర రవి, రేణిగుంటకు మునిచంద్రారెడ్డి, పుత్తూరుకు గంజి మాధవయ్య, వడమాలపేటకు ధనంజయులు నాయుడు, చంద్రగిరికి సరితా రమణమూర్తి, ఆర్సీపురానికి రాధిక, పాకాలకు ఆముదాల శ్రీహరి నాయుడు, ఎర్రావారిపాలేనికి మదనమోహన్, చిన్నగొట్టిగల్లుకు గుణసుందరి, తిరుపతి రూరల్‌కు జి.కళ్యాణి ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు అవకాశముంది. ఇక జనసేన పార్టీకి సంబంధించి రైల్వే కోడూరు ఎంపీపీగా ఆ పార్టీ అభ్యర్థి తాతంశెట్టి తులసి ఎన్నిక కానున్నారు. వైసీపీకి సంబంధించి పుల్లంపేట ఎంపీపీగా ఆ పార్టీ అభ్యర్థి ముద్దా వైష్ణవి ఎన్నికయ్యే అవకాశముంది.