Share News

నైతిక విలువలతో ముందుకెళ్లండి

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:39 AM

నైతిక విలువలు, నిబద్ధతతో ముందుకెళ్లాలని వైద్యవిద్యార్థులకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అభిజిత్‌ చంద్రకాంత్‌ షేత్‌ సూచించారు. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) 14వ స్నాతకోత్సవం శుక్రవారం తిరుపతిలోని మహతిలో ఘనంగా జరిగింది

నైతిక విలువలతో ముందుకెళ్లండి
స్నాతకోత్సవానికి హాజరైన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌ అభిజిత్‌ చంద్రకాంత్‌, టీటీడీ ఈవో రవిచంద్ర, స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్వీ కుమార్‌ తదితరులు

  • వైద్య విద్యార్థులకు ఎన్‌ఎంసీ చైర్మన్‌ సూచన

  • స్విమ్స్‌ స్నాతకోత్సవంలో 16మందికి బంగారు పతకాల ప్రదానం

తిరుపతి సెంట్రల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): నైతిక విలువలు, నిబద్ధతతో ముందుకెళ్లాలని వైద్యవిద్యార్థులకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అభిజిత్‌ చంద్రకాంత్‌ షేత్‌ సూచించారు. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) 14వ స్నాతకోత్సవం శుక్రవారం తిరుపతిలోని మహతిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్య, పరిశోధనా రంగాల్లో స్విమ్స్‌ అగ్రగామిగా ఉందన్నారు. రోగులకు వైద్యసేవలు అందించడంలోనూ ముందు వరుసలో ఉందని ప్రశంసించారు. ఇక్కడ డాక్టరేట్‌ పట్టా పొందినవారు ప్రాణాలను కాపాడి, బాధలను తగ్గించి, మానవ గౌరవాన్ని నిలబెట్టే వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. టీటీడీ ఈవో, స్విమ్స్‌ పాలకమండలి చైర్మన్‌ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, 1993లో నందమూరి తారకరామారావు ఆలోచనతో ప్రారంభమైన స్విమ్స్‌ 1995లో విశ్వ విద్యాలయం స్థాయికి ఎదిగిందన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్వీ కుమార్‌ మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధికి టీటీడీ, సీఎం చంద్రబాబు ఎనలేని సహకారం అందిస్తున్నారని చెప్పారు. స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు సదాశివరావు మాట్లాడుతూ, పింక్‌ బస్సు ద్వారా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ శిబిరాల ద్వారా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీహరిరావు, సీఈ డాక్టర్‌ శిల్ప, గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబరు డాక్టర్‌ జానకి సుభద్ర, డీన్‌ అబాచంద్ర ప్రసాద్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ కోటిరెడ్డి, మెడికల్‌ విభాగాధిపతి డాక్టర్‌ అల్లాడి మోహన్‌, వివిధ విభాగాధిపతులు, కళాశాల ప్రిన్సిపాల్స్‌, వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

16 మందికి బంగారు పతకాలు

వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ చూపిన 16 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. వీరిలో న్యాయపతి రామచంద్రరావు గోల్డ్‌మెడల్‌ను ఎండీ మెడిసిన్‌ చేసిన ప్రవీణ్‌ప్రశాంత్‌కు, డాక్టర్‌ సుభాషిణి కమలాకర్‌ గోల్డ్‌ మెడల్‌ను భావనా పాండేకు, వైవీ సుబ్బారెడ్డి గోల్డ్‌ మెడల్‌ను అనిల్‌కుమార్‌ రెడ్డికి, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, సునీతల గోల్డ్‌ మెడల్‌ను నెఫ్రాలజీ విభాగంలోని జాగృతికి, జనిటో యూరినరీ సర్జరీ విభాగంలో ధీరజ్‌కుమార్‌కు, డాక్టర్‌ జగదీ్‌షకృష్ణలకు అందచేశారు. వీరితోపాటు సింహాద్రి సత్యనారాయణరావు గోల్డ్‌ మెడల్‌ను పవన్‌కుమార్‌కు, డాక్టర్‌ కడియాల సీతారామ స్వామి గోల్డ్‌ మెడల్‌ను వంటేరు పూజకు, సీతా మహాలక్ష్మి, వెంకట నీలాకృష్ణ గోల్డ్‌ మెడల్‌ను గంటా భార్గవికి, నారా శ్రీనివాసులు నాయుడు, నారా నాగమ్మల గోల్డ్‌ మెడల్‌ను భావనా పాండేకు, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం ఐఏఎస్‌ గోల్డ్‌ మెడల్‌ను నామగొండ్ల సుధారావుకు, పొలంరెడ్డి కోనేటిగారి ఫ్యామిలీ గోల్డ్‌ మెడల్‌ను మల్లం చందుకు అందజేశారు. కోమల్‌ రెడ్డి ఫౌండేషన్‌ ట్రస్టు గోల్డ్‌ మెడల్‌ను సి.లావణ్యకు, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం-సునీత గోల్డ్‌ మెడల్‌ను సుహాసినికి, యాస్మిన్‌కు, కోమల్‌ రెడ్డి ఫౌండేషన్‌ ట్రస్టు గోల్డ్‌ మెడల్‌ను బోడిచెర్ల లక్ష్మీహారికకు అందజేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో మహితకు మెరిట్‌ సర్టిఫికెటు, డాక్టర్‌ పాలపర్తిమార్టిన్‌ ఎంరాల్డ్‌కు మెరిట్‌ సర్టిఫికెట్‌తోపాటు నగదు అవార్డును ప్రదానం చేశారు.

Updated Date - Apr 25 , 2026 | 01:39 AM