తహసీల్దారు కార్యాలయంలో తల్లీకుమారుడి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:34 AM
పీలేరు తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం తల్లీకుమారుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూ సమస్య పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన పూజారి ప్రమీల, ఆమె కుమారుడు పూజారి సురేశ్ ఈ చర్యకు పాల్పడ్డారు.
పీలేరు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): పీలేరు తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం తల్లీకుమారుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూ సమస్య పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన పూజారి ప్రమీల, ఆమె కుమారుడు పూజారి సురేశ్ ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న అధికారులు, సిబ్బంది, ప్రజలు అడ్డుకున్నారు. బాధితుల కథనం మేరకు.. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన పూజారి వెంకటరమణ 2012లో పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెం.523/1/1లో 12.50 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి వివాదం రేగడంతో రెవెన్యూ రికార్డుల మేరకు కొలిచి తమకు చూపించాలని పూజారి వెంకటరమణ సతీమణి పూజారి ప్రమీల, ఆయన కుమారులు పూజారి సురేశ్, పూజారి మహేశ్ కొంతకాలంగా రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. గురువారం సాయంత్రం వారు మరోమారు పీలేరు తహసీల్దారు శివకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పరిశీలించమని ఆయన బోడుమల్లువారిపల్లె వీఆర్వో సిద్దయ్యకు అందజేశారు. శుక్రవారం ఉదయం తహసీల్దారు కార్యాలయానికి వచ్చిన పూజారి ప్రమీల, పూజారి సురేశ్ ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకున్నారు. ఖంగుతిన్న కార్యాలయ అధికారులు, సిబ్బంది వెంటనే వారిని అడ్డుకున్నారు. అనేకమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం తన తండ్రి పూజారి వెంకటరమణ 17 ఏళ్లు కార్యాలయాల చుట్టూ తిరిగారని, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన మనోవేదనకు గురై మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యం చేశారనడం వాస్తవం కాదు
ఈ ఘటనపై తహసీల్దారు శివకుమార్ మాట్లాడుతూ గురువారం సాయంత్రం వారు ఇచ్చిన అర్జీని విచారించాలని వీఆర్వో సిద్దయ్యను ఆదేశించానన్నారు. ఈలోపు వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సర్వే చేయడంలో నిర్లక్ష్యం చేశారనడం వాస్తవం కాదన్నారు. వారు ఎఫ్ లైన్ సర్వే కోసం గత నెల 29వ తేదీన చలానా కట్టారని, అది 15 రోజుల తరువాత సంబంధిత సిబ్బందికి ఆన్‌లైన్‌లో వస్తుందని అన్నారు. ఆ తరువాత ఫీల్డ్ సర్వే కోసం సిబ్బంది వెళతారని వివరించారు.
బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
బాధితులను ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఫోన్‌లో పరామర్శించారు. వారికి న్యాయం చేయమని పీలేరు ఆర్డీవో విజయలక్ష్మిని ఆదేశించారు. ఆమె ఆదేశాలతో ఆర్‌ఐ మురగయ్య, మండల సర్వేయర్ రెడ్డి బాబు, వీఆర్వో సిద్దయ్య, గ్రామ సర్వేయర్ అల్ఫియా శుక్రవారం సాయంత్రం వివాదాస్పద భూమిని సందర్శించారు. ప్రైవేటు భూమి కావడంతో క్రయ విక్రయాలపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తేగాని సమస్య కొలిక్కి రాదని వారు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ సర్వే నెంబరులో కొంత భూమి జాతీయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ చేశారని, ఆ రికార్డులు సైతం పరిశీలించాలని తెలిపారు.