Share News

ఆపదలో మాతా శిశువు!

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:53 AM

చిత్తూరు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మరణాల గణాంకాలు

ఆపదలో మాతా శిశువు!

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతృ, శిశు మరణాల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ మరణాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా 2025-26లో ఏకంగా 201 మంది శిశువులు, 11 మంది తల్లులు మృతి చెందడం కలవరపెడుతోంది. ప్రస్తుత 2026-27లో ఇప్పటివరకు 41 మంది శిశువులు, ఆరుగురు తల్లులు మృత్యువాత పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఎక్కడ లోపం?

గర్భిణులను తొలి దశలోనే గుర్తించి హైరిస్క్‌ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించడం, రక్తహీనత, అధిక రక్తపోటు, షుగర్‌ వంటి సమస్యలకు సకాలంలో చికిత్స అందించడం కీలకం. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా పరీక్షలు, ఐరన్‌-ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రల పంపిణీ, హైరిస్క్‌ కేసుల గుర్తింపు సక్రమంగా జరుగుతున్నాయా? అన్నది పరిశీలించాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో 108, 102 సేవలు ఎంత వేగంగా అందుతున్నాయి? హైరిస్క్‌ గర్భిణులను సకాలంలో ఉన్నత స్థాయి ఆస్పత్రులకు తరలిస్తున్నారా? ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, అనస్తీషియన్లు, స్టాఫ్‌ నర్సులు అందుబాటులో ఉన్నారా? రక్తం, ఆక్సిజన్‌, అత్యవసర మందులు, న్యూబోర్న్‌ కేర్‌ సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయా? వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముందస్తు ప్రసవాలు, తక్కువ బరువుతో పుట్టడం, పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి కారణాలు కూడా శిశు మరణాలకు దారితీయవచ్చు. అందువల్ల ప్రసవానికి ముందే ప్రమాదాలను గుర్తించడం, పుట్టిన వెంటనే నాణ్యమైన న్యూబోర్న కేర్‌ అందించడం అత్యంత కీలకం. అయితే జిల్లాలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో కారణంగా ఇటువంటి చర్యలు ఎవరు తీసుకోవడం లేదు. అవగాహన లోపం కారణంగానే ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. క్షేత్రస్థాయితో అవగాహన కల్పించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

విచారణలకే పరిమితమైన డెత్‌ ఆడిట్‌

మాతృ శిశు మరణాలపై ప్రతి నెలా సమీక్షలు, డెత్‌ ఆడిట్లు నిర్వహిస్తున్నా.. వాటి ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవిస్తున్నప్పటికీ సంబంధిత పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందిని విచారించడం, వివరణలు తీసుకోవడంతోనే వ్యవహారం ముగుస్తోందని.. మరణాలకు కారణమైన లోపాలు, నిర్లక్ష్యంపై బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. గత ఐదేళ్లలో జిల్లాలో వెయ్యికి పైగా మాతాశిశు మరణాలు సంభవించినప్పటికీ ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ‘ఎంత నిర్లక్ష్యంగా పనిచేసినా విచారణ జరుగుతుంది.. ఆ తర్వాత వదిలేస్తారు’ అనే భావన క్షేత్రస్థాయి సిబ్బందిలో బలపడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా హైరిస్క్‌ గర్భిణుల గుర్తింపు, సకాలంలో రిఫరల్‌, అత్యవసర వైద్యం, ఫాలోఅప్‌ వంటి కీలక అంశాల్లో మరింత అప్రమత్తత అవసరమైన సమయంలో.. విధుల్లో ఉదాసీనతకు అవకాశం ఏర్పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. మరణాలపై లెక్కలు తేల్చడం మాత్రమే కాదు.. లోపం ఎక్కడ జరిగిందో గుర్తించి, బాధ్యత ఎవరిదో నిర్ధారించి, చర్యలు తీసుకున్నప్పుడే డెత్‌ ఆడిట్‌కు అర్థం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పీహెచ్‌సీల్లో కాన్పులు నిల్‌

జిల్లాలో మొత్తం 64 పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలుంటే ఇటీవల వీటిలో జరిగిన ప్రసవాలు 60లోపు మాత్రమే. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అసలు ప్రసవాలు జరగని పీహెచ్‌సీలు 20కు పైగా ఉన్నాయంటే వైద్యాధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రసూతి సేవల విషయంలో సర్కారు ఆస్పత్రులు నమ్మకాన్ని కలిగించలేకపోవడంతో ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రుల వైపే చూస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 నుంచి 250 ప్రసవాలు నిర్దేశించినా.. అందులో సగమైనా చేరుకోవడం లేదు. కొన్ని చోట్ల కాన్పు కోసం వచ్చిన వారిని పరిశీలించి.. ఏదో ఒకసాకు చెప్పి ప్రైవేటు, జిల్లా ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లినిక్కులకే కొందరు పరిమితం కావడమూ ప్రసూతి సేవలు దారి తప్పుతున్నందుకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైరిస్క్‌ కేసుల్లో తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడే విషయంపై పర్యవేక్షణ కొరవడుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 15 రోజులకోసారి గర్భిణులు ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేయాల్సిన ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు చాలామంది గ్రామాల్లో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పీహెచ్‌సీల తనిఖీలను పూర్తిగా గాలికొదిలేయడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Oct 08 , 2026 | 12:53 AM