జడ్పీటీసీ అభ్యర్థుల్లో సగానికిపైగా మహిళలే
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:17 AM
జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల తుది జాబితాను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల్లో మహిళలే అధికంగా ఉన్నారు.
89లో 46 మంది వాళ్లే
27 మంది డిగ్రీ, ఆరుగురు పీజీ
చిత్తూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల తుది జాబితాను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల్లో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 24 స్థానాలకు 89 మంది పోటీ పడుతుండగా, వారిలో 46 మంది మహిళలే (51.7 శాతం) ఉన్నారు.
వైసీపీ నుంచి 14 మంది గ్రాడ్యుయేట్లు
మొత్తం 89 మంది అభ్యర్థుల్లో 33 మంది గ్రాడ్యుయేట్, ఆపై విద్యార్హత ఉన్నవారున్నారు. వీరిలో వైసీపీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 8 మంది, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు, కాంగ్రెస్ ముగ్గురు, జనసేన ఇద్దరు, బీసీవై, బీఎస్పీ ఒకరు చొప్పున ఈ జాబితాలో ఉన్నారు. 22 మంది పదో తరగతి, 11 మంది ఇంటర్, 27 మంది డిగ్రీ, ఆరుగురు పీజీ చేశారు. ఏకగ్రీవంగా గెలిచిన పూతలపట్టు జడ్పీటీసీ శైలజా తేజోమూర్తి పీహెచ్‌డీ చేశారు.
31-40 ఏళ్ల వయసు వారే అధికులు
వయసు వారీగా చూసుకుంటే 20-30 ఏళ్ల మధ్య వయసున్న వారు 11 మంది, 31-40 వయసున్నవారు 33 మంది, 41-50 ఏళ్ల వారు 30 మంది, 51-60 ఏళ్లున్న వారు 13 మంది, 60 ఏళ్లు దాటినవారు ఇద్దరు బరిలో ఉన్నారు. టీడీపీ, వైసీపీలో 20-30 ఏళ్ల మధ్యలో ఇద్దరు చొప్పున ఉన్నారు. 60 ఏళ్లు పైబడి అభ్యర్థులో టీడీపీలో లేరు. వైసీపీలో ఒకరున్నారు.
గృహిణులు, రైతులే అధికం
జడ్పీటీసీ బరిలో ఉన్న 89 మంది అభ్యర్థుల్లో గృహిణులే 37 మంది ఉన్నారు. 28 మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. 17 మంది సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. నలుగురు కూలీలు, డాక్టర్, అడ్వకేట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
నలుగురు కూలీలు
బరిలో ఉన్నవారిలో నలుగురు అభ్యర్థులు కూలీలు అంటూ తమ నామినేషన్ పత్రాల్లో చూపించారు. ఐరాల, బైరెడ్డిపల్లె మండలాల కాంగ్రెస్ అభ్యర్థులు పరదేశి, శివకుమార్‌తో పాటు కార్వేటినగరం, నిండ్ర బీఎస్పీ అభ్యర్థులు రాజగోపాల్, జయసుధ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో శివకుమార్ 8వ తరగతి, రాజగోపాల్, జయసుధ 10వ తరగతి చదువుకున్నారు.
ఓ డాక్టర్, ఓ సాఫ్ట్‌వేర్..
పాలసముద్రం మండలానికి చెందిన టీడీపీ నేత భీమినేని చిట్టిబాబు ఈసారి తన కుమార్తె జాహ్నవితో నామినేషన్ వేయించగా, ఆమె వైద్యురాలు. రొంపిచెర్ల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి కోట సుష్మ సాఫ్ట్‌వేర్ అని నామినేషన్ పత్రాల్లో పొందుపరిచారు. అలాగే ఐరాల నుంచి జనసేన తరఫున బరిలో ఉన్న మహేష్ అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు.