Share News

అమ్మా.. నేను చేసిన తప్పేంటి?

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:49 AM

ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిపై తల్లి దాడి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి

అమ్మా.. నేను చేసిన తప్పేంటి?

రామకుప్పం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అమ్మా.. నేను చేసిన తప్పేంటి? నాన్నే ఉండుంటే నాకిలా జరిగేదా అని ఏడేళ్ల విశాల్‌ వాపోతున్నాడు. తండ్రి లేని కొడుకును అన్నీ తానై చూడాల్సిన ఆ తల్లి.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి అమానుష దాడికి పాల్పడింది. ఇంటి యజమాని అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. వి.కోటలో శుక్రవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం క్యాశంబల్లకు చెందిన ఇంద్రజకు రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఏడేళ్ల కుమారుడు విశాల్‌ ఉన్నాడు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఎర్రంపల్లెకు చెందిన రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నెల కిందట వీరు వి.కోటలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. రెండు రోజులుగా రాత్రి పూట విశాల్‌ కేకలు పెడుతూ ఏడ్చేవాడు. గురువారం రాత్రి కూడా పెద్దపెట్టున ఏడుస్తుండటం విన్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఇంద్రజ, రాజు, విశాల్‌ను స్టేషనుకు తీసుకొచ్చారు. విశాల్‌ ఒంటి నిండా గాయాలతో పాటు ప్రైవేటు పార్టు వద్ద కోసినట్టున్న గాయాన్ని గుర్తించారు. మెట్లపై నుంచి పడటంతో గాయాలయ్యాయని ఇంద్రజ, రాజు బుకాయించారు. మద్యానికి అలవాటు పడ్డ ఇంద్రజ, రాజు.. తమకు విశాల్‌ అడ్డుగా ఉన్నాడని భావించి, అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు విమర్శలున్నాయి. బాలుడికి వి.కోటలో ప్రథమ చికిత్సనందించి, మెరుగైన చికిత్స కోసం ఇంద్రజతో పాటూ కోలారు అస్పత్రికి పోలీసులు పంపించారు. రాజును తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా, కోలారు ఆస్పత్రి నుంచి ఇంద్రజను వి.కోటకు రమ్మని చెప్పామని సీఐ సోమశేఖర్‌ తెలిపారు. ఈ ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లేదంటే కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తామన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 01:49 AM