అమ్మ అలక.. చూడతరమా!
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:49 AM
శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. గంగాదేవిని వివాహమాడాడని తెలిసి పరమశివుడిపై అలకబూనిన ఆదిశక్తిని బుజ్జగించేందుకు పరమశివుడు ప్రయత్నించడమే పల్లకీసేవలో ప్రధానాంశం.
శ్రీకాళహస్తిలో వైభవంగా ఆదిదంపతుల పల్లకీసేవ
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. గంగాదేవిని వివాహమాడాడని తెలిసి పరమశివుడిపై అలకబూనిన ఆదిశక్తిని బుజ్జగించేందుకు పరమశివుడు ప్రయత్నించడమే పల్లకీసేవలో ప్రధానాంశం. ఈ సేవలో జ్ఞానప్రసూనాంబ దేవి పల్లకిలో ఆశీనురాలై ఎదురుగా ఉన్న దర్పణంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అలంకరించి హారతులు సమర్పించారు. తర్వాత వాహన మండపం వద్ద విద్యుత్తు కాంతులతో సిద్ధమైన పల్లకీల్లో ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. సకల పరివార దళం ముందు సాగగా స్వామి, అమ్మవార్లు చిద్విలాసులై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోలాటాలు, బ్యాండు, డ్రమ్స్, కేరళవాయిద్యాలు ఆకట్టుకున్నాయి. శివనామస్మరణతో చతుర్మాడవీధులు మార్మోగాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లోనే పల్లకీ సేవ చిట్టచివరి ఊరేగింపుగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలమండలి చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ధర్మకర్తలమండలి సభ్యులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం
ముక్కంటి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఆర్జిత సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను రద్దుచేసి, ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
నేడు ఏకాంత సేవ
ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఏకాంత సేవ జరగనుంది. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ఉన్న పళ్లియర (శయన మందిరం)లో ఈ క్రతువును శాస్త్రోకత్తంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల కారణంగా ఏకాంతసేవను రద్దు చేశారు. సోమవారం నుంచి నిత్య సేవగా కొనసాగుతుంది.