భక్తులతో కిటకిటలాడిన మొగిలీశ్వరాలయం
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:13 AM
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
బంగారుపాళ్యం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. బంగారుపాళ్యం మండలం మొగిలిల స్వయంభు కామాక్షి సమేత మొగిలీశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులతో మొగిలి శివాలయం, అనుబంధ ఆలయం దేవరకొండ భక్తులతో నిండిపోయింది. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల భక్తులు శనివారం రాత్రే మొగిలికి చేరుకున్నారు. పలమనేరు, చిత్తూరు, బంగారుపాళ్యం పరిసర గ్రామాల నుంచీ భక్తులు తరలిరావడంతో మొగిలి కిటకిటలాడింది. మధ్యాహ్నం 3 గంటలకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరపున చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, బంగారుపాళ్యం మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పీ ధరణీప్రసాద్, కాణిపాకం ఆలయ ఈవో పెంచలకిషోర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు గంగాధరగురుకుల్, రెడ్డెప్పగురుకుల్‌ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎంబి విజయకుమార్, ఈవో మునిరాజ పాల్గొన్నారు. చిత్తూరు ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడేల్, ఆర్డీవో శ్రీనివాసులు తమ కుటుంబీకులతో స్వామిని దర్శించుకున్నారు. కొండేటివాండ్లవూరుకు చెందిన పారిశ్రామికవేత్త సుకుమార్ శనివారం రాత్రి నుంచి సుమారు 20 వేల మందికి అన్నవితరణ చేశారు. కళ్యాణ్ అభయ్ ట్రస్టు నిర్వాహకులు శీతలపానీయాలు,ఐ్‌సక్రీమ్‌లు అందజేశారు. ఎన్‌ఆర్‌ఐ కళ్యాణ్ పోలీసులకు డ్రోన్‌ను అందించారు. ఈ డ్రోన్‌ను సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వినియోగించి రద్దీని పర్యవేక్షించారు. కాగా, రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం జరిగాక భక్తులను దర్శనానికి అనుమతించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను వృషభవాహనంపై ఊరేగించారు. మాజీ జమీందార్ కుటుంబీకులు ఉభయదారులుగా వ్యవహరించారు.