Share News

పలమనేరులో మోడల్‌ మార్కెట్‌

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:32 AM

పలమనేరులో మోడల్‌ మార్కెట్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనికోసం లైవ్‌స్టాక్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు చెందిన 33 ఎకరాల భూమిని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి బదిలీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం అనుమతిచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినేట్‌ సమావేశంలో ఆమోదం తెలిపింది.

పలమనేరులో మోడల్‌ మార్కెట్‌
టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

పలమనేరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పలమనేరులో మోడల్‌ మార్కెట్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనికోసం లైవ్‌స్టాక్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు చెందిన 33 ఎకరాల భూమిని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి బదిలీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం అనుమతిచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినేట్‌ సమావేశంలో ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మార్కెట్‌ కమిటీ ఇప్పటికే రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించింది. ఈ కొత్త యార్డు వల్ల రైతులకు అమ్మకాలు చేసుకోవడానికి స్థలం దొరుకుతుంది. ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గుతాయి. పలమనేరు పట్టణ పరిధిలోని ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీని (ఏఎంసీ) రైతు బజార్‌ సొసైటీకి అప్పగించి, వాణిజ్య సౌకర్యాలతో కూడిన ఆధునిక రైతు బజారుగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. మంత్రిమండలి నిర్ణయంపై స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతుల అవసరాల దృష్ట్యా పలమనేరు సమీపంలోని కేటిల్‌ ఫారం వద్ద అగ్రికల్చర్‌ ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ ఏర్పాటుకు 2018లోనే సంకల్పించాం. దీనికి పశుసంవర్థక శాఖకు చెందిన 50 ఎకరాల స్థలాన్ని వ్యవసాయ మార్కెట్‌ శాఖకు కేటాయించాలని అప్పట్లో ప్రభుత్వాన్ని అభ్యర్థించాం. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ పనులు ముందుకు సాగలేదు. గతేడాది కూటమి అధికారంలోకి వచ్చాక మోడల్‌ మార్కెట్‌ ఏర్పాటుపై దృష్టి సారించాం. పశుసంవర్థక శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు దీనిపై రెండు దఫాలు సమావేశమై 33ఎకరాలు మాత్రమే కేటాయించేందుకు వీలుంటుందని చెప్పారు. దీనికిగాను ఆ శాఖకు రూ.1.45 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. ఏడాదిన్నర కాలంలో ఈ కంతును పూర్తిచేసి ప్రస్తుతం క్యాబినెట్‌ ఆమోదానికి పంపగా.. ఆ స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మోడల్‌ మార్కెట్‌ ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు.. వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక్కడి ఉత్పత్తులను చెన్నె, బెంగళూరుతో పాటు ఇతర ముఖ్యనగరాలకు తరలించుకొనేందుకు వీలుగా రోడ్డురవాణా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు కుప్పం వద్ద కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా పలమనేరు ప్రాంత రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందనున్నారు. మా అభ్యర్థన మేరకు 33 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్న మంత్రివర్గానికి ధన్యవాదాలు’ అని అమరనాథరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:32 AM