మల్లయ్యకొండలో మైనింగ్ జరగదు
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:14 AM
వైసీపీ దుష్ప్రచారాలను నమ్మవద్దు భక్తుల మనోభావాలను దెబ్బతీసే పని ప్రభుత్వం చేయదు ఎమ్మెల్యేలు కిశోర్‌కుమార్‌రెడ్డి, షాజహాన్ బాషా
తంబళ్లపల్లె, జూన్ 29(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లెకు సమీపంలోని సాధు, ఇనుము, మల్లయ్యకొండల్లో మైనింగ్ జరగదని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పష్టమైన హామీ ఇచ్చారని పీలేరు, మదనపల్లె ఎమ్మెల్యేలు కిశోర్‌కుమార్‌రెడ్డి, షాజహాన్ బాషా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డి ఆధ్వర్యంలో వారు మల్లయ్యకొండను సందర్శించి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాధు, ఇనుము, మల్లయ్యకొండల్లో మైనింగ్ చేస్తున్నారంటూ అపోహలు సృష్టిస్తూ వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఖండించారు. ఈ కొండల్లో మైనింగ్ ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతపక్ష నేత హోదాలో చంద్రబాబు, ఎమ్మెల్యేగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మల్లయ్యకొండలో మైనింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిలుపుదల చేశారని గుర్తు చేశారు. 2024 జనవరిలో మల్లయ్యకొండ సముదాయంలోని ఎర్రకొండలో మైనింగ్‌కు టెండర్లు పిలిచి ఈ ప్రాంతంలో మైనింగ్‌కు ఆజ్యం పోసింది వైసీపీ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా మీరే ఉండి మల్లయ్యకొండను నో మైనింగ్ జోన్‌గా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు, భక్తుల మనోభావాలను గౌరవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల ఆస్తులను, దేవుళ్ల మాన్యాలను కంటికి రెప్పలా కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పఠాన్ ఖాదర్‌ఖాన్, పర్వీన్‌తాజ్, కట్టా దొరస్వామి నాయుడు, డేరంగుల చంద్ర, తులసీధర్‌నాయుడు, సురేంద్రయాదవ్, ఆర్‌జే వెంకటేష్, గుత్తికొండ త్యాగరాజు పాల్గొన్నారు.