Share News

పేలిన మినీలారీ టైరు

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:09 AM

రోజా పూల లోడ్‌తో ఓ మినీ లారీ టైరు పేలడంతో అదుపు తప్పింది.

పేలిన మినీలారీ టైరు
రక్షణ గోడను ఢీకొని ఆగిపోయిన మినీలారీ

బంగారుపాళ్యం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రోజా పూల లోడ్‌తో ఓ మినీ లారీ టైరు పేలడంతో అదుపు తప్పింది. ఫ్లైవోవర్‌పై డివైడర్‌ను దాటి.. పక్క రోడ్లోకి వచ్చి రక్షణగోడను ఢీకొని వాలిపోయింది. ఆదివారం సాయంత్రం బంగారుపాళ్యం మండల పరిధిలోని చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో పెనుప్రమాదమే తప్పింది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి రాజమహేంద్రవరానికి రోజా పూల లోడ్డుతో ఈ మినీలారీ బయలుదేరింది. బంగారుపాళ్యం సమీపంలోని అరగొండ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే టైరు పేలింది. దీంతో మినీలారీ అదుపుతప్పింది. నేరుగా వెళ్లాల్సిన వాహనం పక్కకు తిరిగింది. కుడివైపున డివైడర్‌ను ఎక్కి.. బెంగళూరు వైపు వెళ్లే రోడ్డుపైకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో బెంగళూరు వైపు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ నవీన్‌ చాకచక్యంగా లారీని అదుపుచేయడంతో రక్షణగోడను ఢీకొని ఆగింది. లేకుంటే సుమారు 30 అడుగుల బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయేది. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా బయటపడగా లారీలోని రోజా పూల బస్తాలు సర్వీసు రోడ్డుపైన చెల్లాచెదురుగా పడ్డాయి. ఎస్‌ఐ ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా క్రేన్‌ ద్వారా మినీ లారీని తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 13 , 2026 | 12:09 AM