Share News

ఐదు మండలాల్లో ఖనిజాన్వేషణ

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:22 AM

తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఉనికిని తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ రంగంలోకి దిగనుంది.

 ఐదు మండలాల్లో ఖనిజాన్వేషణ
ఖనిజాన్వేషణ ఒప్పంద పత్రాలతో కోల్‌ఇండియా ప్రతినిధులు,కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తదితరులు

తిరుపతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఉనికిని తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ రంగంలోకి దిగనుంది. మూడేళ్ళ పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఉనికి, నాణ్యత, పరిమాణం వంటి అంశాలను పరిశీలించి నిగ్గు తేల్చేందుకు జిల్లా గనులు, భూగర్భ శాఖ బుధవారం కోల్‌ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లా మైన్స్‌ అధికారులు, కోల్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.తిరుపతి జిల్లా పరిధిలో చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల , చిత్తూరు జిల్లా పరిధిలో పెనుమూరు, వెదురుకుప్పం మండలాల్లో కోల్‌ ఇండియా సంస్థ అరుదైన భూ నిక్షేపాల కోసం అన్వేషణ సాగించనుంది. ఈ ఐదు మండలాల పరిధిలో కలిపి మొత్తం 209.62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సంస్థ తన ఎక్స్‌ప్లొరేషన్‌ కార్యకలాపాలు చేపట్టనుంది. ఈ మొత్తం భౌగోళిక విస్తీర్ణాన్ని జిల్లా మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ రికార్డుల్లో ఒంటిల్లు-చంద్రగిరి మినరల్‌ బ్లాక్‌గా నమోదై వుంది. సరిగ్గా ఈ బ్లాక్‌లోనే కోల్‌ ఇండియా సంస్థ మూడేళ్ళ పాటు అన్వేషణ సాగించనుంది. కేంద్రం చొరవతో రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ఎక్కడెక్కడ అందుబాటులో వుండే అవకాశముందో అంచనా వేసే ప్రక్రియ దేశవ్యాప్తంగా నడుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సైతం మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖకు చెందిన జియాలజిస్టులు ఐదు మండలాల్లో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ దొరికే అవకాశముందని భావిస్తున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న మీదటే సంబంధిత శాఖ టెండర్లు పిలవగా కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ టెండరును దక్కించుకుంది. ఈ మండలాల పరిధిలో బుధవారం నుంచీ 2029 సెప్టెంబరు 21 వరకూ మూడేళ్ళ పాటు అరుదైన ఖనిజాలను అన్వేషించే కార్యక్రమాలు చేపట్టనుంది.స్కాండియం, ఇట్రియం, లాంథనమ్‌, సీరియం, రసోడియం, నియోడిమియం, ప్రొమేధియం, సమారియం, యూరోపియం, గడోలినియం, టెర్బియం, డిస్‌ప్రొసియం, హోల్మియం, ఎర్బియం, తులియం, ఇటెర్బియం, ల్యూటేటియం వంటి అరుదైన ఖనిజ నిక్షేపాలు వుంటాయని జియాలజిస్టులు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో వీటిని అత్యంత ప్రాధాన్యత కలిగిన ఖనిజ వనరులుగా పరిగణిస్తున్నారు. వీటిని ఎలక్ట్రిక్‌ వాహనాల మోటర్లు, అధునాతన బ్యాటరీలు, మొబైల్‌ ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, శాశ్వత అయస్కాంతాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికలు, రక్షణ, అంతరిక్ష రంగాలకు సంబంధించిన పరికరాల తయారీలో వివిధ స్థాయిల్లో వినియోగిస్తారు.

రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ లభిస్తే ప్రత్యేక గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన డిమాండ్‌ వున్న రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఈ ప్రాంతంలో లభించినట్టయితే తిరుపతి జిల్లాకు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అభిప్రాయపడ్డారు.కోల్‌ ఇండియా వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఖనిజ నిక్షేపాల అన్వేషణకు రంగంలోకి దిగుతుండడం సంతోషకర పరిణామమన్నారు. ఒంటిల్లు-చంద్రగిరి మినరల్‌ బ్లాక్‌ ఏయే ప్రాంతాల్లో విస్తరించి వుందో సమగ్రంగా సర్వేలు జరిపి గుర్తించాల్సి వుందని, దాని పరిధిలోకి ఏయే గ్రామాలు, వ్యవసాయ భూములు వంటివి వస్తాయో కూడా గుర్తించాల్సి వుందన్నారు.ప్రజలకు, రైతులకు ఇబ్బంది, నష్టం కలగకుండా జాగ్రత్త్తలు తీసుకుంటామన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:24 AM