మెప్మా సభ్యుల సొమ్ముకు మైరా యాప్‌తో భద్రత
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:24 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘ సభ్యుల సొమ్ముకు మైరా (ఎంవైఆర్‌ఏ) యాప్‌తో భద్రత కల్పించనున్నారు. కృత్రిమ మేధా సాంకేతికతతో ప్రత్యేకంగా ఈ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది.
తిరుపతి సెంట్రల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘ సభ్యుల సొమ్ముకు మైరా (ఎంవైఆర్‌ఏ) యాప్‌తో భద్రత కల్పించనున్నారు. కృత్రిమ మేధా సాంకేతికతతో ప్రత్యేకంగా ఈ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. అధికారులకు ఇప్పటికే విజయవాడలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. వీరు తిరుపతి నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని రిసోర్సు పర్సన్ (ఆర్పీ)లకు అవగాహన కల్పించారు. వీరు మెప్మా పరిధిలోని 32వేల మంది సభ్యుల మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి.. అవగాహన కల్పిస్తారు. ఇదివరకు డీఆర్‌డీఏ పరిధిలోని సభ్యులకు మాత్రమే పొదుపు లెక్కల కోసం ఓ యాప్ అందుబాటులో ఉండేది. తాజాగా మెప్మా పరిధిలోనూ మైరా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అవినీతికి చెక్
ప్రతి సభ్యురాలికీ వ్యక్తిగత పొదుపు, అప్పు తదితర సమాచారం ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. లెక్కల్లో తేడాలుంటే ఫిర్యాదుకూ అవకాశం ఉంది. చదువులేని సభ్యులకు ఎటువంటి సమాచారం అయినా ఏఐ మైక్ ద్వారా వినిపిస్తూ సందేహాలను నివృత్తి చేస్తుందని మెప్మా అధికారులు తెలిపారు. దీనివల్ల అవినీతికి చెక్ పెట్టొచ్చంటున్నారు.