సంక్షేమ హాస్టళ్లలో 50 శాతం కూడా అమలు కాని మెనూ
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:29 AM
వైసీపీ ప్రభుత్వం పేద పిల్లలు ఆశ్రయం పొందుతున్న వసతి గృహాలకు పట్టించుకోలేదు
చిత్తూరు అర్బన్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం పేద పిల్లలు ఆశ్రయం పొందుతున్న వసతి గృహాలకు పట్టించుకోలేదు. మరమ్మతులకు ఐదేళ్లలో నయా పైసా విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించించింది. రూ.11 కోట్లతో జిల్లాలోని హాస్టళ్లను మరమ్మతులు చేసి, అన్నిరకాల మౌలిక వసతుల్ని కల్పించింది. దీంతో జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య 2500 నుంచి 3500కు పెరిగింది. అయితే వార్డెన్లు స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన ఉన్నా జిల్లాలో వార్డెన్లు ఎవ్వరూ స్థానికంగా నివాసం ఉండకుండా మొత్తం బాధ్యతను వాచ్‌మెన్ల మీదే వదిలేస్తున్నారు. సాయంత్రం అవ్వగానే సమీప పట్టణాలకు వెళ్లిపోతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం రాత్రి, గురువారం ఉదయం పలు హాస్టళ్లను విజిట్ చేయగా ఈ విషయం వెల్లడైంది. మెనూ 50 శాతమే అమలవుతోందని కూడా తెలిసింది.
జిల్లాలో 49 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 14 కళాశాల వసతి గృహాలు.. 35 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. ఈ రెండు రకాల వసతి గృహాల్లో 3500 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న కళాశాల బాలికల వసతి గృహంలో అత్యధికంగా 150 మంది వరకు ఉండగా... చౌడేపల్లె మండలంలో అత్యల్పంగా 14 మంది విద్యార్థులు ఉన్నారు. సగటున జిల్లా అంతటా ఒక్కో వసతి గృహంలో 30 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటున్నారు.
ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.11 కోట్లను విడుదల చేసింది. ఎక్కువ మంది విద్యార్థులున్న వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. మొదటి విడతగా 7 ప్లాంట్లను మంజూరు చేయగా... అవి దాదాపు పూర్తి కావస్తున్నాయి. రెండో విడతలో 11 వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
చికెన్ కాళ్లకే పరిమితం
ప్రీమెట్రిక్ విద్యార్థులకు వారానికి మూడుసార్లు, పోస్టు మెట్రిక్ విద్యార్థులకు వారానికి రెండుసార్లు చికెన్, కోడిగుడ్లు పెట్టాలి. ఒక్కో విద్యార్థికి వంద గ్రాములు పెట్టాల్సి ఉంది. అయితే ఒక్క వసతి గృహంలో కూడా వంద గ్రాములు పెట్టకపోగా.. చాలా చోట్ల 30 నుంచి 40 గ్రాములే పెడుతున్నారు. అదీ చికెన్‌లో ఉన్న కాళ్లు, ఇతర పనికిరాని వాటిని కలిపి చికెన్ వాసన ఉండేలా పెడుతున్నారు. ఇక విద్యార్థులకు ఇవ్వాల్సిన పాలు, సాయంత్రం ఇవ్వాల్సిన సేమియ పాయసం, ఉడికించిన బఠాని గింజలు, రాగి లడ్డు, రవ్వ కేసరిని ఇవ్వడం లేదు. రాత్రి భోజనం తరువాత ఇచ్చే అరటిపండు, లోకల్‌గా ఉండే పండ్ల వాసనే విద్యార్థులకు చూపించడం లేదు.
వార్డెన్ల కొరత..
జిల్లాలో మొత్తం 49 ప్రభుత్వ వసతి గృహాలు ఉండగా వాటిలో 12 వసతి గృహాల్లో ఖాళీలు ఉన్నాయి. నగరిలో 3, కార్వేటినగరంలో 2, జీడీ నెల్లూరులో 1, గుడిపాలలో 1, బంగారుపాళ్యంలో 2, పలమనేరులో 1, రాయల్‌పేటలో 1, చిత్తూరులో కాలేజీ హాస్టల్‌లో 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన వార్డెన్లకు ఇన్‌చార్జీలు ఇవ్వడంలో వారు వారానికి ఒకట్రెండుసార్లు మాత్రమే వసతి గృహాలకు వెళుతున్నారు. అక్కడంతా వాచ్‌మెన్లు, కుక్‌లే అన్ని చూసుకుంటున్నారు.
ఎక్కడెక్కడ ఎలా ఉందంటే...
వి.కోట ఎస్సీ హాస్టల్‌లో 96 మంది విద్యార్థులకుగాను 82 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సరిపడే గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. విద్యార్థులందరికీ దుప్పట్లు ఉన్నాయి. వసతి గృహంలో బోరు లేకపోవడంతో పంచాయతీ అధికారులు వదిలే నీటిపైనే ఆధారపడుతున్నామని విద్యార్థులు తెలిపారు.
పలమనేరులో రెండు ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థులు కలిసి ఉండేవారు. పెద్ద పిల్లలతో చిన్నపిల్లలు ఇమడలేక విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పోస్టు మెట్రిక్ విద్యార్థులను అద్దె భవనంలోకి మార్చి అన్ని సౌకర్యాలు కల్పించారు.
.యాదమరి ఎస్సీ బాలికల వసతి గృహంలో మొత్తం 75 మంది విద్యార్థినులకుగానూ 65 మంది ఉన్నారు. కిటికీలకు దోమ తెరలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సరిపడా దుప్పట్లు, కార్పెట్లు ఉన్నాయి.
బంగారుపాళ్యం వసతి గృహంలో 30 మందికిగాను 20 మంది విద్యార్థులు ఉన్నారు. స్నానాల గదుల డోర్లు విరిగిపోయి ఉన్నాయి. కాంట్రాక్టు తీసుకున్న వారు పనులు చేయడం లేదని వార్డెన్లు తెలిపారు.