Share News

జలవనరుల అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:22 AM

తిరుపతిలో ఎంతో ప్రాశస్త్యం కలిగి.. కనుమరుగైన దాదాపు 20 చెరువులను అభివృద్ధి చేసి.. లేక్‌ తిరుపతిగా తయారు చేయడానికి తుడా అధికారులు మెగా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు.

జలవనరుల అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌
తొలి దశలో అభివృద్ధి చేయనున్న అవిలాల చెరువు

తిరుపతి సిటీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఎంతో ప్రాశస్త్యం కలిగి.. కనుమరుగైన దాదాపు 20 చెరువులను అభివృద్ధి చేసి.. లేక్‌ తిరుపతిగా తయారు చేయడానికి తుడా అధికారులు మెగా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే తుడా చైర్మన్‌ డాలర్‌ దివాకర రెడ్డి సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. త్వరలోనే డిల్లీలోని ఐసీఎల్‌ఈఐ కన్సల్టెంట్‌ సంస్థ ద్వారా డీపీఆర్‌లు సిద్ధం చేయించనున్నారు. తుడా, టీటీడీ, ప్రభుత్వం సంయుక్త సహకారంతో దాదాపు రూ.120 కోట్ల నిధులు వెచ్చించి.. దశలవారీగా చెరువులను అభివృద్ధి చేయనున్నారు.

తొలి దశలో..

తొలి దశలో 187 ఎకరాల్లో విస్తరించి ఉన్న అవిలాల చెరువును హైదరాబాదులోని ట్యాంకు బండ్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చెరువు వద్ద ఇప్పటికే దాదాపు రూ.54 లక్షల పనులు చేసి.. అర్ధంతరంగా ఆపేసిన విషయం తెలిసిందే. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలు అనుసరించి పేరూరు, అవిలాల చెరువుల్లో పూడికతీసి.. కట్టలను బలోపేతం చేయనున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి పచ్చదనం, సుందరీకరణ పనులు చేస్తారు. ఈ రెండు చెరువులతోపాటు శెట్టిపల్లె, బూచమ్మగుంట, కొరమేనుగుంట, చెన్నాయగుంట, మంగళం, పాన్‌, తిరుపతి గ్రామీణ, రేణిగుంట చెరువులతోపాటు చంద్రగిరి ప్రాంతాల్లోని చెరువులను స్వర్ణ చంద్రగిరి కింద జలకళ ఉట్టిపడేలా చేయనున్నారు. దీనికోసం ఇప్పటివరకు ప్రాథమికంగా టీటీడీ నుంచి రూ.60 కోట్లు, తుడా నుంచి రూ.20 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.40 కోట్లు అవసరమని ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నివేదికను సీఎంకు తుడా అధికారులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అవిలాల, పేరూరు చెరువులతోపాటు చుట్టు పక్కల ఉన్న ఆరు చెరువులను తుడా వీసీ గోవిందరావు, కార్యదర్శి శ్రీకాంత్‌బాబు, సర్వేయర్‌, ప్రణాళికా విభాగం అధికారులు ఇప్పటికే పరిశీలించారు.

మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

తిరుపతిలో అభివృద్ధి చేయదలచిన 20 చెరువుల్లో ప్రతి మూడు చెరువులకు కలిపి ఒక మురుగు నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనివల్ల తిరుపతి, తిరుపతి రూరల్‌ మండలం చుట్టుపక్కల నుంచి వస్తున్న మురుగు.. రోడ్లపైన నిలవకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:22 AM