మందులా.. బయట కొనుక్కోండి!
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:05 AM
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచీ ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పేద రోగులు వస్తుంటారు. వీరందరికీ మెరుగైన వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో అపోలో సంస్థకు దీర్ఘకాలిక లీజుపై అప్పగించారు.
వైద్యులు రాసిచ్చే మందుల్లో ఒకట్రెండే అందుబాటులో..
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో నిరుపేదలకు కష్టాలు
వైద్య పరీక్ష చేసిన డాక్టరు ఐదారు రకాల మందులు రాస్తారు. ఆస్పత్రి ఫార్మసీకి వెళితే ఒకట్రెండే ఉంటాయి. మిగతావి బయట కొనుక్కోండి అని సిబ్బంది చెబుతున్నారు. ‘వైద్యం ఉచితం.. మందులు భారం..’ అన్నట్లుగా మారింది చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద రోగుల పరిస్థితి.
చిత్తూరు రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచీ ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పేద రోగులు వస్తుంటారు. వీరందరికీ మెరుగైన వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో అపోలో సంస్థకు దీర్ఘకాలిక లీజుపై అప్పగించారు. ఆస్పత్రి నిర్వహణతో పాటు రోగులకు అవసరమైన మందుల సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందం కదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వాటాలో భాగంగా కొంత మందులు, మిగిలిన వాటిని ఆస్పత్రి నిర్వహణ సంస్థ సమకూర్చి రోగులకు ఉచితంగా అందించాలి. అయితే క్షేత్రస్థాయిలో వైద్యుడు ఐదు, ఆరు రకాల మందులు రాస్తే ఒకటి, రెండు మాత్రమే ఫార్మసీలో లభించడం.. మిగిలిన వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు అంటున్నారు. మిగిలిన మందుల కోసం వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో మందులు అందుబాటులో లేకపోవడానికి కారణాలేమిటి? ప్రభుత్వ కోటా మందులు పూర్తిస్థాయిలో సరఫరా అవుతున్నాయా? ఆస్పత్రి నిర్వహణ సంస్థ తన బాధ్యత మేరకు మందులు సమకూరుస్తోందా? ఎంవోయూ అమలవుతోందా? సరఫరా, నిల్వ, పంపిణీ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇచ్చింది ఒక రకమే
ఈమె పేరు మునిరాజమ్మ. 60 ఏళ్లు. ఊరు బంగారుపాళ్యం. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యుడు ఆరు రకాల మందులు రాసిచ్చారు. చీటీ పట్టుకుని ఫార్మసీకి వెళ్లిన ఆమెకు మాత్రం ఒక రకం మాత్రమే ఉన్నాయని, మిగిలినవి బయట కొనుక్కోవాలని సిబ్బంది చెప్పారట. ఇంటికి వెళ్లి మరుసటి రోజు డబ్బులు తీసుకొచ్చి మందులు కొనుక్కుంటానంటూ ఆమె దీనంగా చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
బీపీ మాత్రలూ లేవంట
ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఉన్న ఈమె పేరు లక్ష్మి. జీడీనెల్లూరు మండలం పి.పి.అగ్రహారానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు.. బీపీ, షుగర్, కాళ్ల నొప్పులకు చూపించుకుందామని సోమవారం ఆస్పత్రికి వచ్చారు. ఈమెను పరీక్షించిన డాక్టరు.. బీపీ, షుగర్ మందులతో పాటు కాళ్ల నొప్పులు తగ్గేందుకు ఆయింట్‌మెంట్ రాసిచ్చారు. షుగర్ మాత్రలు తప్ప బీపీ మందులు, ఆయింట్మెంట్ లేవని సిబ్బంది చెప్పారని ఆమె తెలిపారు. బయట మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేశామన్నారు.
గర్భిణులకూ తప్పని తిప్పలు
చిత్తూరు రూరల్ మండలానికి చెందిన పవిత్ర (25) తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చారు. పరీక్షల నిమిత్తం సోమవారం తల్లితో కలిసి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వైద్యులు రాసిచ్చిన మందుల కోసం ఎంసీహెచ్‌ఎ్‌స బ్లాక్‌కు వెళ్లారు. అక్కడ మందులు లేకపోవడంతో ఫార్మసీ వద్దకెళ్లారు. అక్కడా మందులు లేవని చెప్పడంతో బయట మెడికల్ షాపులో కొనుక్కున్నట్లు చెప్పారామె.