మెడికల్ షాపుల బంద్ పాక్షికం
ABN , Publish Date - May 21 , 2026 | 02:02 AM
తిరుపతి జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ పాక్షికంగా విజయవంతమైంది. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు ఆపాలంటూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లాలో దాదాపు 80 శాతం దుకాణాలు మూత పడ్డాయి.
తిరుపతిలో కెమిస్టుల సమాఖ్య భారీ ర్యాలీ
తిరుపతి సెంట్రల్, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ పాక్షికంగా విజయవంతమైంది. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు ఆపాలంటూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లాలో దాదాపు 80 శాతం దుకాణాలు మూత పడ్డాయి. తిరుపతిలో కెమిస్టుల సమాఖ్య నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. త్యాగరాజ మండపం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించి.. ఆర్డీవో రామ్మోహన్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి కెమిస్టుల సమాఖ్య అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఫేక్, ఏఐ టెక్నాలజీతో రూపొందించిన మందుల చీటీలతో ఆన్‌లైన్ మందుల అమ్మకాలు ఆపేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రత్నం, సెక్రటరీ విశ్వనాథం, సభ్యులు మల్లికార్జున రెడ్డి, రఘురామి రెడ్డి, రామిరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు.
తప్పిన ఇబ్బందులు
స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల దుకాణాలతోపాటు వివిధ ఆస్పత్రిల్లోని మెడికల్ షాపుల కౌంటర్లు పనిచేశాయి. దీనివల్ల రోగుల సహాయకులకు ఇబ్బందులు తలెత్తలేదు.