Share News

ఖాకీల అండతో మట్కా

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:35 AM

కొందరు ఖాకీల అండ. ఒకరిద్దరు నేతల వెన్నుదన్ను. వెరసి 12 ఏళ్లుగా శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా ఆడించాడు కింగ్‌పిన్‌ పద్మనాభం అలియాస్‌ కుప్పయ్య. ఎందరో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికి పోవడానికి కారణమయ్యాడు. ప్రజల ఆశను అవకాశంగా తీసుకుని, అతడు నిర్మించిన మట్కా సామ్రాజ్యం నేలకూలింది.

ఖాకీల అండతో మట్కా
పోలీసులు అరెస్టు చేసిన కింగ్‌పిన్‌ పద్మనాభం

  • శ్రీకాళహస్తిలో 12 ఏళ్లుగా నిర్వహణ

  • కింగ్‌పిన్‌ పద్మనాభం అరెస్టుతో వెలుగులోకి

  • ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

  • సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

కొందరు ఖాకీల అండ. ఒకరిద్దరు నేతల వెన్నుదన్ను. వెరసి 12 ఏళ్లుగా శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా ఆడించాడు కింగ్‌పిన్‌ పద్మనాభం అలియాస్‌ కుప్పయ్య. ఎందరో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికి పోవడానికి కారణమయ్యాడు. ప్రజల ఆశను అవకాశంగా తీసుకుని, అతడు నిర్మించిన మట్కా సామ్రాజ్యం నేలకూలింది.

- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి

తమిళనాడులోని పళ్లిపట్టుకు చెందిన పద్మనాభం అలియాస్‌ కుప్పయ్య 12 ఏళ్ల కిందట శ్రీకాళహస్తికి వచ్చాడు. కొందరితో కలిసి ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఓ మహిళతో కలిసి ఉండేవాడు. నెమ్మదిగా మట్కా, పేకాట మొదలు పెట్టాడు. దీనికి పోలీసుల అండ.. ఒకరిద్దరు నేతల మద్దతూ కూడగట్టుకున్నాడు. వైసీపీ హయాంలో ఓ నేతతో కలిసి తన మట్కా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. మట్కాను అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు అధికారుల నుంచి సిబ్బంది వరకు అండగా నిలబడడంతో ఇతడికి ఎదురే లేకుండా పోయింది.అప్పట్లో, అధికార పార్టీ వైసీపీ నుంచీ ఉన్న సహకారం అక్రమ వ్యాపారం పెరగడానికి దోహదపడింది.ఇలా శ్రీకాళహస్తి కేంద్రంగా దాదాపు 12 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నాడు. ఈ వ్యవహారం గురించి ఎప్పటి నుంచో అందరికీ తెలిసినా, పట్టించుకున్న పాపానపోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాపై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి స్థానిక పోలీసు అధికారులకు పలుమార్లు సూచించినట్లు సమాచారం. మరోవైపు శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా నెట్‌వర్క్‌ నడుస్తోందని గుర్తించిన ఎస్పీ సుబ్బరాయుడు శ్రీకాళహస్తి పోలీసు అధికారులతోపాటు జిల్లాలోని అధికారులనూ ప్రతి సందర్భంలోనూ హెచ్చరిస్తూ వచ్చారు. ఈ మట్కా విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సీఎం ఆదేశంతో సీరియ్‌సగా తీసుకున్న ఎస్పీ.. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి రహస్యంగా విచారణ చేపట్టారు. నిరంతరం పర్యవేక్షించారు. ఈక్రమంలో ప్రత్యేక పోలీసు బృందం మట్కా కింగ్‌పిన్‌ పద్మనాభంను అరెస్ట్‌ చేశారు. అతడిని విచారించగా విస్తుబోయే విషయాలు వెలుగుచూశాయి. జూద నెట్‌వర్క్‌ విస్తృతి మాత్రమే కాకుండా, మట్కా నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది పాత్రపై ఆరోపణలు వినిపించాయి. దీనిపై నిర్దారణకు ఎస్పీ సుబ్బరాయుడు శాఖాపరంగా అంతర్గత విచారణ చేయించారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మట్కా నిర్వాహకులకు సహకరిస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్టు తేలింది.

ఖాకీలపై వేటు.. డీఎస్పీకి ఛార్జిషీటు

తనకు అందిన అంతర్గత విచారణ నివేదికను అనంతపురం డీఐజీ షీమోషీ బాజ్‌పాయ్‌కు ఎస్పీ సుబ్బరాయుడు అందజేశారు. ఆమేరకు ఆమె... శ్రీకాళహస్తి వన్‌ టౌన్‌ సీఐ ప్రకా్‌షకుమార్‌ను, గతంలో శ్రీకాళహస్తిలో సీఐగా పనిచేసి ప్రస్తుతం పూతలపట్టు సీఐగా పనిచేస్తున్న గోపీని, శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ను, వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ హేమాద్రిని, టూ టౌన్‌ సీఐ డ్రైవర్‌ ప్రతాప్‌ను, మరో కానిస్టేబుల్‌ క్రాంతికుమార్‌ను సస్పెండ్‌ చేశారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తికి చార్జ్‌ మెమో జారీ చేశారు. గత పదేళ్లకాలంలో జిల్లాలో పనిచేసిన పలువురు పోలీసు అధికారులతో పట్టుబడిన కింగ్‌పిన్‌ పద్మనాభంకు మంచి సంబంధాలున్నట్టు తెలుస్తోంది. అతడిని అరెస్ట్‌ చేయడం జిల్లాలోని మట్కా నెట్‌వర్క్‌లో మిగిలిన బుకీలు, రైటర్లలో వణుకు పుట్టించినట్లు చర్చ సాగుతోంది.

మట్కా ఎలా నడిపారంటే?

శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, పుత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో మట్కా నిర్వాహకులు తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన నిర్వాహకుల కింద పనిచేసే వారిని బుకీలుగా పిలుస్తారు. వీరు నగదు లావాదేవీలు, వసూళ్లను పర్యవేక్షిస్తారు. వారి కింద ఉండే రైటర్లు, పందేలు కాసే వారి నుంచి నెంబర్లు, డబ్బు తీసుకుని నమోదు చేస్తారు. రోజంతా సేకరించిన వివరాలు ప్రధాన నిర్వాహకుల వద్దకు చేరుతాయి. అనంతరం నిర్ణీత సమయానికి ఫలితాలు ప్రకటిస్తారు. వాట్సప్‌ గ్రూప్‌ల వేదికగానే మట్కా సాగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అనేక వాట్సప్‌ గ్రూపులను పోలీసులు గుర్తించారు. జూదంలో గెలిచిన కొద్దిమందిని చూపించి, ఓడిపోయిన వందలమందిని మళ్లీ ఆశతో బరిలోకి దింపడమే ఈ వ్యవస్థ బలం.

Updated Date - Jun 10 , 2026 | 01:35 AM