Share News

తిరుచానూరు ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:38 AM

టీటీడీ, తుడా సంయుక్త సహకారంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు చెప్పారు.

 తిరుచానూరు ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌
సమావేశంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, తుడా చైర్మన్‌ దివాకర రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు

తుడా సహకారం తీసుకుంటామన్న టీటీడీ చైర్మన్‌

తిరుపతి సెంట్రల్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): టీటీడీ, తుడా సంయుక్త సహకారంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు చెప్పారు. తుడా కార్యాలయంలో బుధవారం తిరుచానూరు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై తుడా చైర్మన్‌ దివాకర రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్‌ రెడ్డి, పనబాక లక్ష్మి, తుడా వీసీ, జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, కార్యదర్శి శ్రీకాంత్‌ బాబు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు అవసరం, ఆలయం చుట్టూ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు అమలుకు వున్న ఇబ్బందులు? అక్కడ నివాసితుల అభిప్రాయాలకు అనుగుణంగా భూసేకరణ చేసి, ప్రత్యామ్నాయ భూములు చూపించారా అనే విషయాలపై దాదాపు గంట పాటు చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అమ్మవారి దర్శనార్థం వచ్చే వేలాదిమంది భక్తులకు, స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు, ట్రాఫిక్‌ సమస్య నుంచి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా టీటీడీ, తుడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రోడ్ల విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోయే నిర్వాసితులతో అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, దాదాపు 100 నుంచి 110 మంది తమ ఇళ్లను అప్పగించడానికి అంగీకరించారన్నారు. ఆలయ పరిసరాల్లో రోడ్ల విస్తరణ కోసం నిర్వాసితులకు 1:2 నిష్పత్తిలో నష్టపరిహారం ఇవ్వనున్నట్లు వెల్తడించారు.వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని 3.5 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌ జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. తుడా చైర్మన్‌ దివాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల వ్యవస్థీకృత అభివృద్ధికి తుడా కట్టుబడి వుందన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి దామినేడు వద్ద గృహ నిర్మాణాల కోసం స్థల పరిశీలన జరుగుతోందన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:38 AM