Share News

జీడీనెల్లూరులో భారీగా రీసర్వే అక్రమాలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 02:36 AM

జీడీనెల్లూరు మండలం కొట్రకోన గ్రామంలో వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వేలో భారీగా అవకతవకలు బయటపడ్డాయి. రీసర్వే తర్వాత తయారుచేసిన డ్రాఫ్ట్‌ ఆర్వోఆర్‌ను పాత రికార్డులతో పోల్చితే.. అసైన్డ్‌ భూముల నమోదు, పట్టాల మార్పిడి, ప్రభుత్వ భూముల విస్తీర్ణం తగ్గించి డీకేటీ భూములుగా నమోదు చేయడం, పట్టా భూముల ఖాతాల్లో విస్తీర్ణ వ్యత్యాసాలు తదితర అంశాల్ని అధికారులు గుర్తించారు.

జీడీనెల్లూరులో భారీగా రీసర్వే అక్రమాలు
కొట్రకోనలో దిద్దుబాటు చర్యల కోసం సర్వే చేస్తున్న బృందం

చిత్తూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జీడీనెల్లూరు మండలం కొట్రకోన గ్రామంలో వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వేలో భారీగా అవకతవకలు బయటపడ్డాయి. రీసర్వే తర్వాత తయారుచేసిన డ్రాఫ్ట్‌ ఆర్వోఆర్‌ను పాత రికార్డులతో పోల్చితే.. అసైన్డ్‌ భూముల నమోదు, పట్టాల మార్పిడి, ప్రభుత్వ భూముల విస్తీర్ణం తగ్గించి డీకేటీ భూములుగా నమోదు చేయడం, పట్టా భూముల ఖాతాల్లో విస్తీర్ణ వ్యత్యాసాలు తదితర అంశాల్ని అధికారులు గుర్తించారు. ఇటీవల జీడీనెల్లూరు తహసీల్దార్‌ శ్రీనివాసులు ఈ విషయాన్ని జేసీ ఆదర్శ రాజేంద్రన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జేసీ ఆగ్రహించి 14 మందితో కూడిన బృందాన్ని తప్పుల్ని సరిదిద్దేందుకు ఆ గ్రామానికి పంపించారు.

46 మందికి 29.44 ఎకరాల అసైన్డ్‌ భూములు

రీసర్వే సమయంలో ఆ గ్రామంలో పనిచేసిన సర్వేయర్లు.. 1బీ లేకపోవడంతో పాటు డీకేటీ పట్టాలు కూడా జారీ కాని భూముల్ని అసైన్డ్‌ భూములుగా నమోదు చేసేశారు. ఇలా ఏకంగా 46 మందికి 29.44 ఎకరాలు నమోదు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన నలుగురికి 7.08 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ మ్యుటేషన్‌ చేసేశారు.

ప్రభుత్వ భూముల విస్తీర్ణాన్ని తగ్గించి..

ఈ గ్రామంలోని డీకేటీ భూముల్లోనూ భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. అనుమతించిన, పరిమితికి మించి డీకేటీ భూముల విస్తీర్ణాన్ని నమోదు చేశారు. ఇలా 98 ఖాతాల్లో 80.64 ఎకరాల డీకేటీ భూముల్ని అదనంగా పెంచారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల విస్తీర్ణం తగ్గినట్లు తేలింది. అదేవిధంగా 400 పట్టా భూముల ఖాతాల్లో, 26 జాయింట్‌ ఎల్‌పీఎంలలో పరిమితికి మించి భారీ స్థాయిలో తేడాలు కనిపించాయి. వీటి మొత్తం విస్తీర్ణాన్ని గుర్తించాల్సి ఉంది.

పట్టాదారు పుస్తకాల ముద్రణకు బ్రేక్‌

ఈ అవకతవకలు తీవ్రంగా ఉండడంతో కోట్రకోన భూముల ప్రస్తుత రికార్డుల ఆధారంగా సెప్టెంబరులో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించడం సాధ్యం కాదని అధికారులు చేతులెత్తేశారు. గ్రామంలో రికార్డుల్ని మరోసారి పూర్తిగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో భూముల్ని తనిఖీ చేసి వివరాల్ని సరిచేసే పనిలో ఉన్నారు.

సరిచేసే పనిలో నిమగ్నమైన బృందం

కొట్రకోనలో బయటపడిన అక్రమాలను తహసీల్దార్‌ శ్రీనివాసులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. భూరికార్డుల్లో ఇంతటి భారీ వ్యత్యాసాలు, అక్రమ నమోదులు చోటు చేసుకోవడంపై జేసీ ఆగ్రహించినట్లు తెలిసింది. తప్పుల్ని సరిచేసి రికార్డుల్ని క్రమబద్ధీకరించేందుకు 14 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. మూడు రోజులుగా ఈ బృందం గ్రామంలో పర్యటిస్తోంది. గ్రామంలో రికార్డుల్ని పరిశీలిస్తూ, భూముల వాస్తవ విస్తీర్ణం, రికార్డుల్లో నమోదైన వివరాలను సరిపోల్చి తప్పుల్ని సరిచేసే చర్యలు చేపట్టింది.

Updated Date - Aug 14 , 2026 | 02:36 AM