శెట్టిపల్లె ప్లాట్లకు సామూహిక రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:20 AM
తిరుపతి జిల్లావ్యాప్తంగా 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా ప్రతి చోటా రోజుకు వంద చొప్పున రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 2111 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగియనుంది. దానికోసం ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉదయం, సాయంత్రాల్లో ప్రత్యేక పనిగంటలు నిర్ణయించారు.
తిరుపతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా ప్రతి చోటా రోజుకు వంద చొప్పున రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 2111 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగియనుంది. దానికోసం ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉదయం, సాయంత్రాల్లో ప్రత్యేక పనిగంటలు నిర్ణయించారు. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్లాట్లను రిజిస్టర్ చేసిచ్చేందుకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేపడుతున్న సామూహిక రిజిస్ట్రేషన్ల ఏర్పాట్లు ఇవి.
మార్చి మొదటి వారంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్
మార్చి మొదటి వారంలో శెట్టిపల్లె ప్లాట్లను రిజిస్టర్ చేయించాలని కలెక్టర్ నిర్ణయించారు. 223 ఎకరాలలో 2111 మందికి ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. వారికి ప్రభుత్వం తరపున సంబంధిత స్థలాలను రిజిస్టర్ చేసివ్వాల్సి వుంది. అంతమందికి తిరుపతి అర్బన్, రూరల్, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే తిరుపతి అర్బన్, రూరల్, రేణిగుంట కార్యాలయాల్లో రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్య చాలా ఎక్కువగా వుంటుంది. వాటికి తోడు శెట్టిపల్లె స్థలాల రిజిస్ట్రేషన్లు కూడా పెట్టుకుంటే వారాల తరబడీ సమయం తీసుకుంటుంది. కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ఈ వ్యవహారం ముగించాలని కలెక్టర్ నిర్ణయించారు. దానికోసం జిల్లావ్యాప్తంగా వున్న 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఆయా చోట్ల రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా ఉదయం 7 గంటల నుంచీ 10 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచీ 7 గంటల వరకూ శెట్టిపల్లె స్థలాల రిజిస్ట్రేషన్లకు సమయం కేటాయిస్తున్నారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ రోజుకు వంద రిజిస్ట్రేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల్లోనే మొత్తం రిజిస్ట్రేషన్లు ముగించనున్నారు. లబ్ధిదారుల జాబితాలో ఏ నంబరు నుంచీ ఏ నంబరు వరకూ ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో, ఏ రోజున, ఏ సమయానికి రిజిస్ట్రేషన్ చేయాలన్నది పక్కాగా షెడ్యూలు నిర్ణయిస్తున్నారు. సంబంధిత సమాచారాన్ని లబ్ధిదారులకు పంపించి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
వారం తర్వాత డాక్యమెంట్లు, ఎల్పీ సర్టిఫికెట్ల పంపిణీ
మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల పేరిట స్థలాల రిజిస్ట్రేషన్లు జరిగిపోయాక వారం రోజుల తర్వాత వారికి డాక్యుమెంట్లు అందజేయనున్నారు.ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు తుడా, రెవిన్యూ అధికారులు జారీ చేసే ల్యాండ్ పూలింగ్ సర్టిఫికెట్లు కూడా అందజేయనున్నారు. ఈ సర్టిఫికెట్ లేకపోతే భవిష్యత్తులో లబ్ధిదారులకు ఇబ్బందులు వస్తాయని, అందుకే రెండు విభాగాల నుంచీ ప్రత్యేకంగా ల్యాండ్ పూలింగ్ సర్టిఫికెట్ జారీ చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి.