Share News

కులాలకతీతంగా సామూహిక పొంగళ్ళు

ABN , Publish Date - Jan 14 , 2026 | 02:02 AM

రామకుప్పంలో సంక్రాంతి పండుగను రైతు కుటుంబాలు విభిన్న రీతిలో జరుపుకుంటాయి. అనాదిగా కులాలకతీతంగా గ్రామదేవతలకు సామూహికంగా పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఒక్కోసారి మకరసంక్రాంతి రోజు లేకపోతే సంక్రాంతి తర్వాత వచ్చే బుధవారం పొంగళ్ళు సమర్పణ చేస్తారు.

కులాలకతీతంగా సామూహిక పొంగళ్ళు
పొంగళ్ళు సమర్పించేందుకు వెళ్తున్న రైతు కుటుంబాలు

రామకుప్పం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రామకుప్పంలో సంక్రాంతి పండుగను రైతు కుటుంబాలు విభిన్న రీతిలో జరుపుకుంటాయి. అనాదిగా కులాలకతీతంగా గ్రామదేవతలకు సామూహికంగా పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఒక్కోసారి మకరసంక్రాంతి రోజు లేకపోతే సంక్రాంతి తర్వాత వచ్చే బుధవారం పొంగళ్ళు సమర్పణ చేస్తారు. ఉదయం 9గంటలకు రామకుప్పం పట్టణంలోని రైతుకుటుంబాలు రెడ్డివీధి నుంచి బయలుదేరి కంబాలదేవులపల్లె సప్తమాతృక చౌడేశ్వరమ్మ ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి తొలిపూజ నిర్వహించి, పొంగళ్ళు సమర్పిస్తారు. అక్కడి నుంచి పేరూరు గ్రామ సమీపంలోని కుంటిగంగమ్మ, రామకుప్పంలోని సల్లాపురెమ్మ, దిగువవీధిగంగమ్మ, రెడ్డివీధి గంగమ్మ, చౌడేశ్వరమ్మ, పెద్దపులెమ్మ, తిరుపతిగంగమ్మ, శివాజీనగర్‌ గంగమ్మ, రామనగర్‌ గంగమ్మ, కోదండరామనగర్‌ గంగమ్మ ఆలయాల్లో పూజలు చేసి పొంగళ్ళు సమర్పిస్తారు. ఆయా ఆలయాల వద్ద స్థానికులు అమ్మవార్లకు కోళ్ళు, గొర్రెలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆ మరుసటి రోజు స్థానిక దిగువవీధిలో ఎద్దులపండుగను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగను తిలకించేందుకు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివస్తారు.

అనవాయితీని అనుసరిస్తున్నాం

పూర్వీకుల ఆనవాయితీని మేమంతా అనుసరిస్తున్నాం. గ్రామంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలన్న ఆకాంక్షతో అమ్మవారి ఆలయాల్లో ఏటా సామూహిక పొంగళ్ళు సమర్పిస్తున్నాం. దిగువవీధిలో జరిగే ఎద్దుల పండుగకు అన్ని ప్రాంతాల నుంచి కుల, మత బేధం లేకుంగా తరలివస్తారు. పండుగ ప్రశాంతంగా జరిగేలా యువత కృషి చేస్తుంది.

సీతాపతి

ఊరు బాగుండాలనే.....

మా ఊరు బాగుండాలని, పాడిపంటలు బాగుండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని పట్టణ నలుమూలల్లో ఉన్న 11అమ్మవారి ఆలయాల్లో పూజలు చేస్తున్నాం. రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు కుల, మత రహితంగా ప్రతి ఒక్కరూ ఎంతో సహకరిస్తారు.

పద్మనాభరెడ్డి

చిన్ననాటి నుంచి పాల్గొంటున్నాం

పెద్దపండగైన సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటాం. చిన్నప్పటి నుంచే పెద్దలతో కలిసి పొంగళ్ళు సమర్పణ, ఎద్దుల పండుగ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నా.

రామకృష్ణప్ప

Updated Date - Jan 14 , 2026 | 02:02 AM