Share News

ముసుగుదొంగల హల్‌చల్‌

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:30 AM

గంగవరం సాయిగార్డెన్‌ సిటీలో శనివారం అర్ధరాత్రి నలుగురు దొంగలు భీభత్సం సృష్టించారు.

 ముసుగుదొంగల హల్‌చల్‌
సీసి ఫుటేజీలో రికార్డయిన దొంగల ఫోటో

గంగవరం,ఏప్రిల్‌26(ఆంధ్రజ్యోతి): ఇక్కడి సాయిగార్డెన్‌ సిటీలో శనివారం అర్ధరాత్రి నలుగురు దొంగలు భీభత్సం సృష్టించారు. వివరాలు ఇలా.. సాయిగార్డెన్‌ సిటీలో ఉంటున్న పీఆర్‌ ఏఈ శ్రీనివాసులు కుటుంబసభ్యులు శనివారం ఇంటికి తాళం వేసి కాకినాడ వెళ్లారు. ఆయన బయటకు వెళ్లారు. ఈవిషయం పసిగట్టిన దొంగలు అర్ధరాత్రి సమయంలో ముసుగు ధరించి మొదటి అంతస్తులోని శ్రీనివాసులు ఇంటి తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించారు. సుమారు 150 గ్రాముల బంగారు, 300 గ్రాముల వెండితో పాటు పలు విలువైన సామగ్రి,నగదును దొంగిలించారు. అంతటితో ఆగకుండా ఆ ఇంటి పక్కనే మరో ఇంటిలో ఎవరూ లేరని భావించి తలుపు పగలగొట్టడానికి ప్రయత్నించారు. శబ్ధం రావడంతో ఇంట్లోని వారు లైట్లు వేయగా, ముసుగు దొంగలు పరారయ్యారు. ఆ ఇంటి వారు వెంటనే గంగవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రాంభూపాల్‌ సిబ్బందితో కలిసి చేరుకున్నారు. ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పోలీసులకు తనకు తెలిసిన మేర చోరీ అయిన సొత్తు వివరాలు చెప్పారు. భార్య , పిల్లలు కాకినాడ నుంచి వస్తే తప్ప ఎంత చోరీ జరిగిందో చెప్పలేనని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ముసుగుదొంగల ఫోటోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 27 , 2026 | 01:30 AM