Share News

మార్కెట్‌ విలువ భూమ్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:36 AM

అన్ని మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్‌ ధరల విలువ పెంచేందుకు జిల్లా మార్కెట్‌ వ్యాల్యూ రివిజన్‌ కమిటీ పచ్చజెండా ఊపింది.

మార్కెట్‌ విలువ భూమ్‌

మున్సిపాలిటీలలో 10-15 శాతం పెంపు?

రిజిస్ర్టేషన్‌శాఖ వెబ్‌సైట్‌, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో వివరాలు

29వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరరణ

ప్రతిపాదనను ఆమోదించిన జిల్లా మార్కెట్‌ వ్యాల్యూ రివిజన్‌ కమిటీ

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): అన్ని మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్‌ ధరల విలువ పెంచేందుకు జిల్లా మార్కెట్‌ వ్యాల్యూ రివిజన్‌ కమిటీ పచ్చజెండా ఊపింది. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో జిల్లా రిజిస్ర్టార్‌ వెంకటరమణమూర్తి, డీఆర్వో మోహన్‌ కుమార్‌, జిల్లాకు చెందిన ఏడుగురితోపాటు పాకాల, చిన్నగొట్టిగల్లు సబ్‌ రిజిస్ర్టార్లు పాల్గొన్నారు. 10 నుంచి 15 శాతం మేరకు విలువల పెంపునకు సమావేశం ఆమోదించింది. ఈ పెంపు ప్రతిపాదిత వివరాలను రిజిస్ర్టేషన్‌శాఖ వెబ్‌సైట్‌లో, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో మంగళవారం నుంచి అందుబాటులో ఉంచారు. వీటిపై ఈ నెల 29వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అందిన అభ్యంతరాల పరిశీలన అనంతరం ఈ నెల 31న కలెకర్‌ అఽధ్యక్షతన జరిగే రివిజన్‌ కమిటీ సమావేశంలో పెంపుపై తగిన నిర్ణయం తీసుకుని పెంపు శాతాన్ని ఖరారు చేస్తారు. ఈ పెంపు మార్కెట్‌ విలువ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ సెలవులో వెళ్లడంతో కలెక్టర్‌ పర్యవేక్షణలో భూ మార్కెట్‌ ధరల విలువ పెంపు ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, భూ మార్కెట్‌ విలువలపై రెవెన్యూ, సబ్‌ రిజిస్ర్టార్‌ అధికారులు ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతమున్న ధరలపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 10-15 శాతం మేరకు మార్కెట్‌ విలువలు పెంచుతూ ప్రతిపాదన సిద్ధమైంది. ఇప్పటికే అత్యధికంగావిలువ ఉన్న ప్రాంతాల్లో తక్కువ మోతాదులో విలువలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన తరువాత భూముల మార్కెట్‌ విలువలను ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి పెంచనుండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో 15 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉందని సబ్‌ రిజిస్ర్టార్లు చెబుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు త్వరలో రానున్న ఫ్యాక్టరీలకు అనుకుని ఉన్న పల్లెలు, మున్సిపాలిటీల్లో ఈ పెంపు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Updated Date - Jan 28 , 2026 | 01:36 AM