Share News

రూ.20కోట్ల గంజాయి దహనం

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:27 AM

ఎలక్ట్రిక్‌ యంత్రంతో కాల్చేసిన పోలీసులు

రూ.20కోట్ల గంజాయి దహనం
గంజాయి ప్యాకెట్లను పరిశీలిస్తున్న కలెక్టరు, ఎస్పీ తదితరులు

రేణిగుంట, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో స్వాధీనం చేసుకున్న రూ.20కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయిని పోలీసులు దహనం చేశారు. కలెక్టరు వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయిడు సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం తూకివాకం పంచాయతీ ఎర్రంరెడ్డిపాలెంలోని డంపింగ్‌ యార్డు వద్ద గంజాయి ప్యాకెట్లు, బస్తాలను పరిశీలించారు. అనంతరం గంజాయిని ఎలక్ట్రిక్‌ యంత్రం సాయంతో కాల్చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం ఐజీ ర్యాంకు స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఈగల్‌ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన నిఘాతో ఇప్పటి వరకు 208కేసుల్లో 4,100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఏఎ్‌సఆర్‌, కాకినాడ, విశాఖ జిల్లాల నుంచి జిల్లాకు గంజాయి వస్తోందన్నారు. ఇక్కడినుంచి చెన్నై, బెంగళూరు, కేరళకు రవాణా అవుతున్నట్టు గుర్తించామన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్‌ పార్టీలను ఏర్పాటు చేసి రైళ్లు, బస్సులు, లగేజీలను తనిఖీలు చేసి.. గంజాయిని పట్టుకుంటున్నారని చెప్పారు. అలాగే గంజాయి రవాణాదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎవరైనా గంజాయిని రవాణా చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 8, 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే గంజాయి ద్వారా కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకొస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు మనోహరాచారి, వెంకట్రావు, డీఎస్పీలు భక్తవత్సలం, మూర్తి, ప్రసాద్‌, రవికుమార్‌, చెంచుబాబు, గీత, సీఐలు మంజునాథరెడ్డి, జయచంద్ర, ఎస్‌ఐలు ధర్మారెడ్డి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 01:27 AM