‘మంగాపురం’ ఘటనపై ప్రశ్నలెన్నో?
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:40 AM
చిత్తూరు రూరల్ మండలం మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దొంగతనానికి వస్తే కాపలాదారుడ్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆనందరావుపై ఏదైనా కక్ష ఉందా? అతడిని చంపాక వెళ్లిపోకుండా, మళ్లీ ఇంట్లోకి వచ్చేందుకు ఎందుకు ప్రయత్నించారు?
ఘటన పరిసరాల్లో చెప్పులు, టపాసులు లభ్యం
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
చిత్తూరు రూరల్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరు రూరల్ మండలం మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దొంగతనానికి వస్తే కాపలాదారుడ్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆనందరావుపై ఏదైనా కక్ష ఉందా? అతడిని చంపాక వెళ్లిపోకుండా, మళ్లీ ఇంట్లోకి వచ్చేందుకు ఎందుకు ప్రయత్నించారు? ఒక గ్లాస్ డోర్ పగలకొట్టేందుకు నాటుబాంబు ఎందుకు వేశారు? ఇంట్లోకి రావాలనుకున్న వాళ్లు ఇద్దరు వృద్ధులు కేకలు వేయడంతో ఎందుకు పరారయ్యారు? ఒకవేళ దొంగతనానికే వస్తే వెంట తెచ్చుకున్న మరో రెండు బాంబులున్నా ఎందుకు వాడకుండా బయట వదిలి వెళ్లారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కాంట్రాక్టు కిల్లింగ్‌లా ఉంది?
జరిగిన ఘటన చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న కాంట్రాక్టు కిల్లింగ్ పనిలా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అలజడి లేకుండా, పెనుగులాట లేకుండా, ఎంతో సైలెంట్‌గా హత్య చేశారు. బలవంతులైన నలుగురు కలిస్తేనే.. ఇలాంటి హత్యను చేయగలమని భావిస్తున్నారు. కాంట్రాక్టు కిల్లింగ్ చేయించేంత పెద్ద వ్యక్తి కూడా కాదు ఆనందరావు. కేవలం ఆ ఇంట్లో ఉంటూ వారిచ్చే జీతంతో బతుకుజీవనం సాగిస్తున్నారు. ఏదైనా వివాహేతర సంబంధమా సాధారణంగా తాగి కోపంలో ఎలాగోలా పొడిచి వెళ్లిపోతారు. ఇక్కడ చాలా ఆర్గనైజ్‌గా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. ఇంటి యజమానులకు ఆస్తి గొడవల కోణంలోనూ విచారించినా అలాంటిదేమీ లేదని తెలిసింది.
దుండగులు తమిళనాడుకు చెందిన వారా?
దుండగులు వాడిన నాటు బాంబుకు చుట్టిన దారం ఇక్కడిదిలా కనిపించలేదు. చిత్తూరు ప్రాంతంలో నాటు బాంబులకు టొయిన్ పురి దారం వాడతారు. అయితే, ఈ నాటుబాంబుకు వాడిన దారం.. అక్కడక్కడ నల్ల రంగు కలిసి, నూలు దారంలా ఉంది. దీనిని తమిళనాడు ప్రాంతంలో వాడుతుంటారు. దీంతో దుండగులు తమిళనాడుకు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, బాంబులో తమిళ పేపర్లు వాడినట్లు సమాచారం.
ఫ ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే..
ఈ ఘటనపై ఎన్నో అనుమానాలున్నా.. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే బాంబులకు వాడిన నల్లమందు, వస్తువులు ఇక్కడివేనా అనేదానిపై స్పష్టత వస్తుంది. పోస్టుమార్టం నివేదిక వస్తే ముఖానికి దిండు పెట్టారా.. కాళ్లు, చేతులు ఎవరైనా పట్టుకొని ఆ తర్వాత హత్య చేశారా..? ఎంత మంది ఈ హత్యలో పాల్గొన్నారనే విషయాలు తెలుస్తాయి. రెండు రోజులు సెలవులు కావడంతో మరో రెండు రోజుల్లో ఈ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది.
టపాకాయలు, రెండు జతలు చెప్పులు లభ్యం
ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఆదివారం మళ్లీ జాగిలాలతో పోలీసులు తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాల్లో రెండు జతల చెప్పులు, 30 షాట్స్ టపాకాయల బాక్సు లభ్యమైనట్లు సమాచారం. టపాకాయల్లో వాడే నల్లమందును ఈ నాటుబాంబు తయారీకి ఉపయోగించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు పరిసరాలు, చుట్టుపక్కల మండలాల పరిధిలోనూ పోలీసులు వాహనాలు, గస్తీ తిరుగుతూ తనిఖీలు చేస్తున్నారు.
మృతదేహం కుటుంబీకులకు అప్పగింత
బాపట్ల జిల్లాకు చెందిన ఆనందరావు మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం.. ఆనందరావు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది.