Share News

మన్నవరం’ దొంగలపరం

ABN , Publish Date - May 18 , 2026 | 12:57 AM

ఎన్‌బీపీపీఎల్‌ సొత్తుకు రెక్కలు కనీస భద్రత లేక చోరుల ఇష్టారాజ్యం యంత్రసామగ్రి తరలిపోతున్నా పట్టని వైనం మిగుల భూములపై ఊరిస్తున్న ప్రకటనలు

మన్నవరం’ దొంగలపరం
యంత్రాలు చోరీ కావడంతో ఖాళీ అయిన ఫాబ్రికేషన్‌ బ్లాక్‌

ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ కోసం ప్రభుత్వం వందల ఎకరాలను సేకరించింది. ఎందరికో ఉపాధి కలుగుతుందని ఆశలు రెకెత్తించింది. ఫలితంగా పరిసరాల్లో భూముల ధరల పెరుగుదలకు కారణమైంది. సాక్షాత్తూ నాటి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవంచేసుకుంది. అయినా ఆరంభం నుంచీ ఒడుదొడుకులను ఎదుర్కొంటూవచ్చింది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించకుండానే మూతపడింది. ఆఖరుకు అందులో విలువైన యంత్ర సామగ్రి సైతం చోరులపరమవుతోంది. అయినా సంబంధిత వర్గాల్లో స్పందన కరువైంది. మన్నవరంలోని ఎన్‌బీపీపీఎల్‌ దయనీయ పరిస్థితి ఇది.

శ్రీకాళహస్తి రూరల్‌, ఆంధ్రజ్యోతి: శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో 2010లో ఎన్‌బీపీపీఎల్‌(ఎన్‌టీపీసీ బీహెచ్‌ఈఎల్‌ పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌) కర్మాగారం ఏర్పాటైంది. నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ దీనికి ప్రారంభోత్సవం చేశారు. కార్మగార నిర్మాణానికి అప్పట్లో రూ.6వేల కోట్లు కేటాయించారు. నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేలమందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నెమ్మదిగా విద్యుత్‌ ఉపకరణాల తయారీ యంత్రాల ఉత్తత్తి ప్రారంభమైంది. సుమారు 2వేలమందికి పైగా కూలీలు ఇందులో పనిచేసేవారు. 500మందికి పైగా అధికారులు ఇక్కడి ఉత్పత్తి పనులను పర్యవేక్షించేవారు. కాల క్రమేణా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సంస్థ ఉత్పత్తి తగ్గిపోయింది. నిర్దేశిత లక్ష్యానికి చేరకమునుపే సంస్థ ఉనికి కోల్పోయింది. రాన్రానూ అధికారులు తగ్గుతూ వచ్చారు. 2025 అక్టోబరు నుంచి వారు కూడా రావడం మానేశారు. ఉన్నతాశయంతో ప్రారంభించిన సంస్థ ప్రోత్సాహం కొరవడి మూలకు చేరింది.

మూతపడ్డాక కొరవడిన భద్రత

మూతబడిన ఎన్‌బీపీపీఎల్‌ కోట్ల రూపాయల విలువైన సంపదకు కనీస భద్రత కరువైంది. కేంద్రస్థాయిలోని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో కర్మాగారంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు రూ.50కోట్ట విలువైన యంత్రాలు, పరికరాలు అపహరణకు గురైనట్లు అంచనా. భద్రతా సిబ్బంది లేకపోవడంతో ప్రధాన గేటు తాళాలు పగులగొట్టి దొంగలు లోనికి చొరబడుతున్నారు. రోజూ రాత్రి వేళల్లో ఇక్కడికి వాహనాలు వస్తూ వెళ్తూ ఉన్నా స్పందనలేదు. ఒకట్రెండుసార్లు స్థానికులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు.

ఫ్యాబ్రికేషన్‌ బ్లాక్‌ ఖాళీ..

విద్యుత్‌ ఉపకరణాల తయారీకి విదేశాల నుంచి కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ప్రధాన యంత్రాలు ధ్వంసమయ్యాయి. రవాణాకు అనుకూలమైన యంత్రాలను దొంగలు తరలించేశారు. యంత్రాలతో నిండుగా ఉండే ఫాబ్రికేషన్‌ బ్లాక్‌ను ఖాళీ చేసేశారు. సుమారు 50 వరకూ అత్యాధునిక వెల్డింగ్‌ యంత్రాల్లోని విలువైన కాపర్‌ను తీసుకుపోయారు. ఒక్కో వెల్డింగ్‌ యంత్రం విలువ సుమారు రూ.5లక్షల పైమాటేనని తెలుస్తోంది. పరిపాలన భవనం అద్దాలు పగులగొట్టి వంద కంప్యూటర్లు, 35 ఏసీలు అపహరించినట్లు సమాచారం. సంస్థ బాధ్యులెవరూ లేకపోవడంతో చోరుల పని సులభమైందని భావిస్తున్నారు.

నిరుపయోగంగా మిగులు భూములు

ఎన్‌బీపీపీఎల్‌ నిర్మాణానికి అప్పట్లో 750ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో వందెకరాల్లో మాత్రమే సంస్థకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయి. 16 ఏళ్లుగా మిగిలిన 650 ఎకరాలు నిరుపయోగంగా పడిఉంది. ఏడాదికాలంగా ఈ మిగులు భూముల్లో కొత్త పరిశ్రమలు వస్తాయని అధికారులు,నాయకులు చెబుతున్నారు. ఆశలు చిగురింపజేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా రాలేదు. ఈ విలువైన ఖాళీ భూముల్లో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పడితే ఉపాధి లభిస్తుందని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - May 18 , 2026 | 12:57 AM