మామిడి కొనుగోళ్లు ప్రారంభం
ABN , Publish Date - May 21 , 2026 | 02:21 AM
బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో బుధవారం నుంచి మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యార్డులోని 110 మండీలకుగాను 70 మండీల్లో వ్యాపారులు కాయలు కొన్నారు
బంగారుపాళ్యం, మే 20 (ఆంధ్రజ్యోతి): బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో బుధవారం నుంచి మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యార్డులోని 110 మండీలకుగాను 70 మండీల్లో వ్యాపారులు కాయలు కొన్నారు. శనివారానికల్లా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభయ్యే అవకాశం ఉందని మండీ యజమానులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన వ్యాపారులు పచ్చళ్ల కోసం మామిడి కాయలు కొని బస్తాలు కట్టి తరలిస్తున్నారు.
ఫ బీఎల్ కండ్రిగకు చెందిన సుధాకర్‌నాయుడు రెండు టన్నుల ఖాదర్ రకం మామిడి కాయలను మార్కెట్‌కు తీసుకురాగా రూ.1.10 లక్షలు ధర పలికింది. దీతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నాణ్యత గల కాయలు మాత్రమే కోయాలని రైతులకు మండీ యజమానులు సూచించారు.
ధరలు ఇలా..
కవరు కట్టిన ఖాదర్, మల్లిక రకాలు టన్ను రూ.55 వేలు. గుజ్జు పరిశ్రమకు తరలించే ఖాదర్ రూ.21 వేలు. కవరు కట్టిన బేనీషా టన్ను రూ.53 వేలు. పచ్చళ్లకు వాడే నాటీ రకాలు టన్ను రూ.6 వేలు.