Share News

మామిడి ధర పలుకుతోంది

ABN , Publish Date - May 12 , 2026 | 01:58 AM

జిల్లాలో మామిడి సీజన్‌ మొదలైంది. ధర పలకడమే కాకుండా ఇతర రాష్ట్రాలకూ కాయల రవాణా జోరందుకుంది. ధరలనుచూస్తే.. ఇమామీ పసంద్‌ టన్ను రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు, బేనీషా టన్ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. కవర్లు కట్టిన బేనిషా టన్ను ఏకంగా రూ.55 వేలకు విక్రయమవుతోంది.

మామిడి ధర పలుకుతోంది
చిత్తూరు మార్కెట్‌ యార్డులో ఇతర రాష్ట్రాలకు పంపేందుకు గ్రేడింగ్‌ చేసిన తోతాపురి రకం మామిడి

జిల్లాలో మామిడి సీజన్‌ మొదలైంది. ధర పలకడమే కాకుండా ఇతర రాష్ట్రాలకూ కాయల రవాణా జోరందుకుంది. ధరలనుచూస్తే.. ఇమామీ పసంద్‌ టన్ను రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు, బేనీషా టన్ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. కవర్లు కట్టిన బేనిషా టన్ను ఏకంగా రూ.55 వేలకు విక్రయమవుతోంది. మల్లిక టన్ను రూ.30వేల నుంచి రూ.40 వేలు, పుల్లేరా టన్ను రూ.18 వేల నుంచి రూ.20వేలు పలుకుతోంది. బెంగుళూరా టన్ను (రాలిన కాయలు) రూ.2000 పలుకుతుండగా, కవర్లు కట్టిన తోతాపురి టన్ను రూ.13 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. గత ఏడాది గిట్టుబాటు ధర లేక అతి కష్టంమీద టన్ను గిట్టుబాటు ధర రూ.12వేలు నిర్ధారించినా, రూ.8 వేలు మించి కొనుగోలు కాలేదు. ఈ ఏడాది తోతాపురి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏకంగా టన్ను రూ.13 వేల మైలురాయిని దాటిన నేపథ్యంలో మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు మార్కెట్‌ యార్డుకు చేరిన మామిడి.. బెంగళూరు, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. చిత్తూరుతో పాటు దామలచెరువు, పూతలపట్టు ప్రాంతాల్లో తోతాపురి కొనుగోళ్లు జోరందుకున్నాయి.

వాతావరణం ప్రతికూలమైనా..

ప్రతికూల వాతావరణంలో చేతికి వచ్చిన మామిడి కాయలకు ధర పలుకుతుండటం రైతులకు ఉపశమనంగా మారింది. ఈ సీజన్‌లో గాలికి 30 శాతం మామిడి పూత రాలిపోయింది. ఆపై నిలిచిన పూతకు వచ్చిన కాయల్లో గాలి వానకు మరో 20శాతం నేలరాలాయి. మిగిలిన కాయలను కాపాడుకునేందుకు రైతులు కవర్లు కట్టారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే మామిడి పక్వానికి వచ్చింది. కాయ దెబ్బతినకుండా చేతికి వచ్చింది. దిగుబడి తగ్గినా.. ధర పలుకుతుండటం మామిడి రైతుకు కొంత ఊరటనిస్తోంది. ఇక, గుజ్జు ఫ్యాక్టరీల్లో ఇప్పటికే లక్ష టన్నుల పల్ప్‌ నిల్వలున్నా.. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువ కారణంగా వాళ్లూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తోతాపురి తొలిదశలో వచ్చిన పంటను కొనేందుకు 7 ఫ్యాక్టరీలు ముందుకు వచ్చాయి. మిగిలినవీ సిద్ధం కావడంతో.. ధర గణనీయంగా పెరుగుతోంది.

- చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - May 12 , 2026 | 01:58 AM