మామిడి తోటలు నరికేస్తున్నారు..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:59 AM
ఎల్‌నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సాగుపైనే కాకుండా ఉన్న పంటలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
అన్నమయ్య, అక్టోబర్ 7(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సాగుపైనే కాకుండా ఉన్న పంటలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మామిడి రైతులకు తీవ్ర నష్టం మిగుల్చుతోంది. దాదాపుగా 70 రోజులు చినుకు జాడ లేకపోవడంతో మామిడి తోటలు ఎండిపోతున్నాయి. చిన్నమండెం మండలం వండాడి గ్రామానికి చెందిన గుడ్ల రాణికి చెందిన ఐదు ఎకరాల పొలంలో 30ఏళ్ల వయస్సు కలిగిన 300 మామిడి చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీరుపెట్టే స్థోమత లేక తోటను నరికించేసింది. జిల్లాలోని రాయచోటి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలలో 36వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. రాయచోటి ప్రాంతంలోని చిన్నమండెం, సంబేపల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల్లో ఎక్కువగా చెట్లు ఎండిపోయాయి. పలుచోట్ల పాతిక శాతం నుంచి సగానికి పైగా చెట్లు ఎండిపోగా..కొన్నిచోట్ల పూర్తిగా పోయాయి. ఒక్క చిన్నమండెం మండల పరిధిలో దాదాపు 100 హెక్టార్లలో మామిడి చెట్లు ఎండిపోయాయి.
ఎండిన చెట్ల వివరాలు నమోదు చేశాం
రైతు సేవా కేంద్రాల ద్వారా ఎండిన చెట్ల వివరాలను నమోదు చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నష్ట పరిహారం కోసం సిఫారసు చేస్తాం. 50శాతమా? 33శాతమా అనేది ఆదేశాలు రావాల్సి ఉంది.
- సురేష్, మండల ఉద్యానవన శాఖాధికారి, చిన్నమండెం