Share News

మామిడికి ఎగుమతుల కిక్కు

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:38 AM

పూత రాలిపోయింది. మళ్లీ మందు పిచికారీ చేశారు. పిందె నిలవలేదు. కాస్త కాయ పెద్దది కాగానే గాలివానకు నేల రాలాయి.

మామిడికి ఎగుమతుల కిక్కు
మండీకి వచ్చిన మామిడి కాయలు

పూత రాలిపోయింది. మళ్లీ మందు పిచికారీ చేశారు. పిందె నిలవలేదు. కాస్త కాయ పెద్దది కాగానే గాలివానకు నేల రాలాయి. ఇలా ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, మిగిలిన మామిడి కాయలకు కవర్లు కట్టడంతో నాణ్యత వచ్చింది. దీనివల్ల ఎగుమతులు పెరిగి ధరల కిక్కు వచ్చింది. నాణ్యమైన కాయలకు రైతులు ధరను డిమాండు చేసే పరిస్థితి రావడం గమనార్హం.

- చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

చిత్తూరు మార్కెట్‌ యార్డుకు రోజురోజుకు మామిడి కాయలు రావడం పెరుగుతోంది. మరోవైపు నాణ్యమైన, కవరు కట్టిన మామిడి రావడంతో ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో తోతాపురి నుంచి టేబుల్‌ వెరైటీల వరకు మంచి ధర పలకడంతో సంబంధిత రైతులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలతో పాటు మలేషియా, సింగపూర్‌, దుబాయ్‌కి సైతం ఎగుమతులవుతున్నాయి. పలు రాష్ట్రాల వ్యాపారులు వేలంలో పాల్గొంటుండటంతో పోటీ నెలకొంటోంది. దీనివల్ల టేబుల్‌ వెరైటీల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బంగారుపాళ్యం మార్కెట్‌లో శుక్రవారం కవరు కట్టిన తోతాపురి కిలో రూ.17 ధర పలికింది. మరికొందరు రూ.14 లెక్కన బెంగళూరుకు తీసుకెళ్లారు. సోమవారం నుంచి ఈ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, ఫ్యాక్టరీలు ప్రస్తుతం టన్నుకు రూ.7 వేలు ఇస్తుండగా, ఫుడ్‌ ఇన్‌ ఫ్యాక్టరీ శనివారం నుంచి రూ.8 వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అలాగే, చిత్తూరు మార్కెట్‌ యార్డుకు వచ్చే మామిడి కాయలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం 130 టన్నులు రాగా, గురువారం 105 టన్నులు, శుక్రవారం 191 టన్నులు వచ్చాయి. శనివారం నుంచి రోజుకు 200 టన్నులకుపైగా వచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెటింగ్‌ అధికారుల అంచనా. ఈ క్రమంలో శుక్రవారం మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పరమేశ్వరన్‌ మార్కెట్‌ యార్డు వెళ్లారు. యార్డుకు వస్తున్న కాయలు, ఎగుమతి అవుతున్నవి, వ్యాపారులు ఇస్తున్న ధరలను పరిశీలించారు.

హిమామ్‌ పసంద్‌ ః రూ.1.2 లక్షలు

బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి వ్యాపారం ఊపందుకుంది. శుక్రవారం రైతులు తెచ్చిన మామిడిని పలు రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు కొన్నారు. టేబుల్‌ రకాలైన హిమామ్‌ పసంద్‌ టన్ను రూ.72 వేల నుంచి రూ.1.20 లక్షలు పలకగా కవరు కట్టిన బేనీషా రూ.35 వేల నుంచి రూ.42 వేలు, కవరు కట్టని బేనీషా రూ.16 వేల నుంచి 26 వేల వరకు ధర పలికింది. నాణ్యమైన మల్గూబా టన్ను రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ధర పలికింది. కవరు కట్టిన మల్లిక టన్ను రూ. 25 వేల నుంచి 35 వేలు, కాలేపాడు రూ.25 వేల నుంచి 45 వేలు.. కవరు కట్టిన ఖాదర్‌ రకం రూ.40 వేల నుంచి45 వేల రూపాయలు, గుజ్జు పరిశ్రమకు తరలించే ఖాదర్‌ రకం టన్ను రూ.18 వేలు.. చందూరా రూ.7 వేల నుంచి రూ.15 వేలకు అమ్ముడుపోయింది. గుజ్జు పరిశ్రమకు తరలించే తోతాపురి టన్ను రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. నేరుగా ఫ్యాక్టరీలకు తరలిస్తే రూ.7 వేలు ఇస్తున్నట్లు రైతులు చెప్పారు. టేబుల్‌ వెరైటీలను కొనడానికి ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొంటున్నారు.

- బంగారుపాళ్యం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 06 , 2026 | 12:39 AM