Share News

కంటైనర్‌ ఢీకొని మృత్యు ఒడికి

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:43 AM

జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ శ్రీసిటీ ఉద్యోగులు దుర్మరణం చెందారు.

కంటైనర్‌ ఢీకొని మృత్యు ఒడికి
మృతులు శ్రావణి , రాజశేఖర్‌ (ఫైల్‌ ఫొటోలు)

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట హోలిక్రాస్‌ సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ శ్రీసిటీ ఉద్యోగులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు శ్రీసిటీ ప్రైమరీ ఎలక్ర్టికల్‌ పరిశ్రమలో పనిచేసే తమిళనాడుకు చెందిన రాజశేఖర్‌ (33), సూళ్లూరుపేట గాండ్లవీధికి చెందిన గోపిశెట్టి శ్రావణి (31) విధి నిర్వహణ ముగించుకుని మోటారు సైకిల్‌పై వస్తుండగా హోలిక్రాస్‌ సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై సూళ్లూరుపేటకు వచ్చేందుకు తిరుగుతుండగా అదేవైపు వస్తున్న కంటైనర్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివాహిత శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలపాలై ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్‌ను హైవే మొబైల్‌ వాహనం ద్వారా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తమిళనాడు ఆరణి ధర్మారంకు చెందిన రాజశేఖర్‌ సూళ్లూరుపేటలోనే అద్దె ఇంట్లో ఉంటూ రోజూ శ్రీసిటీకి వెళ్లేవాడు. సూళ్లూరుపేటకు చెందిన శ్రావణి కూడా అదే పరిశ్రమలో పనిచేస్తుంది. మంగళవారం నైట్‌ షిప్ట్‌ కావడంతో డ్యూటీకి వెళ్లింది. డ్యూటీ ముగించుకుని రాజశేఖర్‌తో కలిసి మోటారు సైకిల్‌పై వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరో 3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శ్రావణికి భర్త, ఇద్దరూ ఆడ పిల్లలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 05 , 2026 | 01:43 AM