Share News

ఎమ్మెల్సీపీ స్థానంలో మల్లీఫ్లెక్స్‌ విత్‌ స్టార్‌ హోటల్‌

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:09 AM

తిరుపతి రైల్వేస్టేషన్‌ పార్శిల్‌ ఆఫీస్‌ ఎదురుగా గల కార్పొరేషన్‌ స్థలంలో నిధుల లేమితో అర్ధంతరంగా ఆగిపోయిన మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ (ఎమ్మెల్సీపీ) స్థానంలో మల్టీఫ్లెక్స్‌ థియేటర్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌తోపాటు 3స్టార్‌ హోటల్‌ ఏర్పాటు కానుంది.

ఎమ్మెల్సీపీ స్థానంలో మల్లీఫ్లెక్స్‌ విత్‌ స్టార్‌ హోటల్‌

- పీపీపీ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించిన కార్పొరేషన్‌

తిరుపతి సిటీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి రైల్వేస్టేషన్‌ పార్శిల్‌ ఆఫీస్‌ ఎదురుగా గల కార్పొరేషన్‌ స్థలంలో నిధుల లేమితో అర్ధంతరంగా ఆగిపోయిన మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ (ఎమ్మెల్సీపీ) స్థానంలో మల్టీఫ్లెక్స్‌ థియేటర్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌తోపాటు 3స్టార్‌ హోటల్‌ ఏర్పాటు కానుంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో తిరుపతి నగరపాలక సంస్థ టెండర్లను ఆహ్వానించింది. దీనికి హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ సంస్థ ఆసక్తి చూపుతున్నట్టు మూడ్రోజుల క్రితం జరిగిన పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షలో అధికారులు వెల్లడించారు.

ఆదాయంలో కార్పొరేషన్‌కు 5 శాతం వాటా

ఏడు అంతస్తులతో నిర్మాణం చేయాల్సిన భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పార్కింగ్‌తోపాటు మొదటి రెండు అంతస్తుల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఆ తర్వాత మల్టీఫ్లెక్స్‌ థియేటర్స్‌, త్రీస్టార్‌ హోటల్‌ నిర్మాణం చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికికాను దాదాపు రూ.155కోట్లు ఖర్చుగా అంచనాలు వేశారు. ఆసక్తిగల సంస్థలు ముందుకొస్తే ఇప్పటివరకు నిర్మించిన మూడు అంతస్తులకు రూ.17కోట్లను నిర్మాణ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు బిల్డింగ్‌ను కొత్తగా చేజిక్కించుకునేవారికి స్వాధీనం చేస్తారు. నిర్మాణం పూర్తయ్యాక 25 ఏళ్లపాటు కాంట్రాక్టర్‌కు అనుభవ హక్కు ఉంటుంది. ఇందుకుగాను భవనం నుంచి వచ్చే ఆదాయంలో ఐదు శాతం కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

వైసీపీ తప్పిదాల్లో ఇదొకటి

తిరుపతి నగరంలో పార్కింగ్‌ సమస్య తీర్చడానికి 2018వ సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.15కోట్ల బడ్జెట్‌తో 120 కార్లు, 120 స్కూటర్లు పార్కింగ్‌ చేసుకునేలా మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. ఎన్నికలకు ఏడాది ముందు (2022 డిసెంబరు 9న) బడ్జెట్‌ను రూ.15కోట్ల నుంచి రూ.50కోట్లకు పెంచుతూ భూమిపూజ చేశారు. ఎన్నికలు ముగిసేసరికి పాతికశాతం పనులు కూడా పూర్తికాలేదు. స్మార్ట్‌ సిటీ నిధులు ఆగిపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలపై సమీక్షించిన మున్సిపల్‌ అధికారులు పీపీపీ పద్ధతిలో కేటాయిస్తే భవనం అందుబాటులోకి రావడంతోపాటు కార్పొరేషన్‌కు ఆదాయం కూడా సమకూరుతుందని భావించారు. కార్పొరేషన్‌ ఎస్‌ఈ శ్యాంసుందర్‌తో ఈ విషయమై మాట్లాడగా ఈనెల 13న నిర్వహించాల్సిన టెండరు గడువును నెలాఖరు వరకు పొడిగించామని తెలిపారు.హైదరాబాద్‌లో ఇలాంటి ప్రాజెక్టు ఇటీవల విజయవంతంగా పూర్తిచేసిన ఓ సంస్థ ముందుకొచ్చిందని, అలాంటి సంస్థలు ఏవైనా టెండరులో పాల్గొనవచ్చని వివరించారు.

Updated Date - Apr 12 , 2026 | 01:09 AM