బాహదా తూము గేటు మొరాయింపు
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:38 AM
మదనపల్లె, జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రధానమైంది.దిగువన ఉన్న రైతులు కొందరు తమకు నీరు అవసరం లేదని, ఆ నీటితో మా పంటలు ఊటు పడుతున్నాయని తూము గేటు మూసేశారు. ప్రస్తుతం మిగిలిన రైతులకు నీరు అవసరం కావడంతో తూము గేటును తీయడానికి రైతులు ప్రయత్నించారు. పది రోజులుగా ప్రయత్నం చేస్తున్నాఫలితం లేకపోవడంతో కొంత పంట ఇప్పటికే ఎండిపోగా, అయిన పంట కూడా గింజలు లేక జల్లు పట్టిపోయింది.
నిలిచిన నీటి ప్రవాహం.. ఎండుతున్న పంటలు
సిబ్బంది లేరంటున్న ఇరిగేషన్ అధికారులు
మదనపల్లె, జూన్ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రధానమైంది. కుడి, ఎడమ కాలువల ద్వారా నిమ్మనపల్లె, వాల్మీకిపురం, కలికిరి మండలాల్లో సాగునీరు అందిస్తున్నారు. ఏడాది క్రితం కురిసిన వర్షాలకు ప్రాజెక్టు మొరవపోయింది. ఎడమ, కుడి కాలువల కింద 2,280 ఎకరాల ఆయకట్టు ఉండగా ఈ సీజన్‌లో వెయ్యి ఎకరాలకుపైగా రైతులు పంటలు సాగుచేశారు. ముందుగా సాగుచేసిన పంటలు ఇప్పటికే కోతకు వచ్చాయి. ఎడమ కాలువ కింద మొదటి భాగంలో ఇంకా వంద ఎకరాలు వరి సాగులోనే ఉంది. రెండు, మూడు తడులు అవసరం కూడా. అయితే దిగువన ఉన్న రైతులు కొందరు తమకు నీరు అవసరం లేదని, ఆ నీటితో మా పంటలు ఊటు పడుతున్నాయని తూము గేటు మూసేశారు. ప్రస్తుతం మిగిలిన రైతులకు నీరు అవసరం కావడంతో తూము గేటును తీయడానికి రైతులు ప్రయత్నించారు. పది రోజులుగా ప్రయత్నం చేస్తున్నాఫలితం లేకపోవడంతో కొంత పంట ఇప్పటికే ఎండిపోగా, అయిన పంట కూడా గింజలు లేక జల్లు పట్టిపోయింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే తమ వద్ద సిబ్బంది లేరని, తూమును తాము తెరవలేమని సమాధానం ఇచ్చినట్లు బాధిత రైతులు వాపోతున్నారు. వరి గింజలు పక్వానికి వచ్చే సమయంలో నీరు లేక పంట ఎండిపోవడం, గింజ జల్లు పట్టిపోవడంతో రైతులు పశుగ్రాసానికి వాడుతున్నారు.