Share News

పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రచురణకు ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:10 AM

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల మేరకు మార్చి 9న గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రచురణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు తెలిపారు.

పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రచురణకు ఏర్పాట్లు చేయండి
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్న డీపీవో సుధాకర్‌రావు

డీపీవో సుధాకర్‌ రావు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల మేరకు మార్చి 9న గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రచురణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు తెలిపారు. బుధవారం స్థానిక డీపీవో కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై డీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. జిల్లా విభజన అనంతరం జిల్లాలో ఉన్న 625 పంచాయతీలు, 5070 వార్డుల్లో పాలకవర్గ ఎన్నికలు జరపాల్సి ఉందన్నారు. అసెంబ్లీ నియోకవర్గాల వారీగా అందిన ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్లు(డీడీవో) మండలాల వారీగా విభజించి డిప్యూటీ ఎంపీడీవోలకు అందించాలన్నారు. వాటిని గ్రామ పంచాయతీల వారీగా డిప్యూటీ ఎంపీడీవోలు సిద్ధం చేసి పంచాయతీ కార్యదర్శులకు ఇస్తే వారు వార్డుల వారీగా విభజించాలని పేర్కొన్నారు. ఆ జాబితాలతో క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వెళ్లి జాబితా మేరకు ఓటర్లు ఉన్నారా లేదా పరిశీలించి వందశాతం నిజమైన జాబితాను తయారు చేయాలన్నారు. విభజన తీరును ఈ నెల 20న వర్చువల్‌ విధానంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారులు వివరిస్తారన్నారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరిస్తారని తెలిపారు. ఇంటి పన్ను వసూళ్లు ఇంత వరకు 65శాతం మాత్రమే జరిగిందని, అధికారులు మరింత శ్రద్ధ చూపి ఈ నెలాఖరులోగా శతశాతం పూర్తి చేయాలని, వీటి పర్యవేక్షణ ఆయా డీడీవోలు చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో డీడీవోలు రవికుమార్‌, ఇందిరమ్మ, రామచంద్ర, మండల డిప్యూటీ ఎంపీడీవోలు, ప్రతి మండలం నుంచి ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 01:10 AM