స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోండి
ABN , Publish Date - Oct 09 , 2026 | 02:02 AM
స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా అధికారులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.
కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశం
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి):స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా అధికారులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయంలో పూర్తిచేయాల్సి ఉన్నందున అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్, చైర్‌పర్సన్ స్థానాలకు నేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల సామగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటును ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు.సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియపై అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా జిల్లా అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.జేసీ గోవిందరావు, నగరపాలకసంస్థ కమిషనర్ జయకృష్ణ, డీఆర్వో నరసింహులు, డీపీవో సుశీలాదేవి, జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటనారాయణ, ఆర్డీవోలు భానుప్రకాష్, రామ్మోహన్, దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.