రిటైర్డు ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:49 AM
మదనపల్లెలో బుధవారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రిటైర్డు ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించి రూ.30లక్షల బంగారు, వెండి నగలు చోరీ చేశారు.
మదనపల్లె క్రైం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మదనపల్లెలో బుధవారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రిటైర్డు ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించి రూ.30లక్షల బంగారు, వెండి నగలు చోరీ చేశారు. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన కె.ఆర్.రవీంద్ర ఆర్‌డబ్ల్యూఎస్ డీఈగా. ఆయన భార్య నిర్మల ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. వారి ఇద్దరు పిల్లలు ఉద్యోగరీత్యా వారు బెంగళూరులో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి ఇంట్లో దంపతులు మాత్రమే నివాసం ఉంటున్నారు. ఈనేపథ్యంలో బుధవారం అర్థరాత్రి దాటాక సుమారు రెండుగంటల ప్రాంతంలో గుర్తుతెలియని చెడ్డీలు వేసుకున్న నలుగురు దుండగులు ముసుగు కప్పుకుని ఈఇంటికి వచ్చారు. బెడ్‌రూం కిటికీ ఇనుప కమ్మీలను కట్టర్‌తో కట్ చేసి లోనికి ప్రవేశించారు. బీరువా, కప్‌బోర్డు తలుపులను బద్దలుకొట్టి అందులోని 326 గ్రాముల బంగారు, ఒకటిన్నర కిలోల వెండి నగలు, రూ.25వేల నగదు తీసుకుపోయారు. మరో బెడ్‌రూంలో నిద్రిస్తున్న రవీంద్ర గురువారం తెల్లవారుజామున నిద్రలేచారు. బాత్రూం వెళ్తూ..బెడ్‌రూం తలుపు, కిటికీ తెరిచి ఉండటాన్ని గమనించాడు. గదిలోకెళ్లి చూడగా బీరువా, కప్‌బోర్డులు తెరిచి సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాజారెడ్డి సిబ్బందితో కలసి వెళ్లి పరిశీలించారు. ఇంటి వద్ద, వీధిలోని సీసీఫుటేజీలను పరిశీలించారు. అందులో నలుగురు వ్యక్తులు చెడ్డీలు వేసుకుని, ముసుగు కప్పుకుని ఇంట్లోకి ప్రవేశించి, చోరీ అనంతరం బయటకెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. డాగ్‌స్క్వాడ్ సిబ్బంది తనిఖీ నిర్వహించారు. క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
చెడ్డీగ్యాంగ్‌పై అనుమానం..
చోరీ చేసింది చెడ్డీగ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. పీలేరులో కొద్ది రోజుల కిందట ఇదే గ్యాంగ్ వారం పదిరోజులు రెక్కీ నిర్వహించి రెండిళ్లల్లో చోరీ చేసింది. పీలేరు, మదనపల్లెలోని సీసీఫుటేజీల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తే ఈ గ్యాంగ్ ఒకటే అని పోలీసులు భావిస్తున్నారు. చోరీ చేసింది చెడ్డీగ్యాంగ్ అని నిర్థారణ అయినట్లు పోలీసులు చెప్పారు. రవీంద్ర ఇంట్లో కూడా వారం రోజుల రెక్కీ నిర్వహించి చోరీ చేశారని తెలిపారు. ఎస్పీ ధీరజ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీఫుటేజీలను పరిశీలించి, స్థానికులను విచారించారు. చెడ్డీగ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. బెడ్‌రూంలో కూలర్ పెట్టుకుని నిద్రిస్తుండగా దాని శబ్దానికి ఏమీ వినబడలేదని బాధితుడు బాధితుడు ఎస్పీకి చెప్పారు.