ముమ్మరంగా మహాశివరాత్రి ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:45 AM
మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 10నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 15న మహాశివరాత్రి, 16న ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 17వ తేదీ అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణం, 19న గిరిప్రదక్షిణ, 21న పల్లకీసేవ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఆయా రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం లోపల ఇప్పటికే రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. అలాగే ధ్వజస్తంభం, మహాద్వారం ప్రదేశాల్లో అద్దిన రంగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఆహ్వానం
మహాశివరాత్రి ఉత్సవాలకు విచ్చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను బుధవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి ఆహ్వానించారు. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే ముక్కంటి జ్ఞాపిక, ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.