Share News

చెరువులకు మహర్దశ

ABN , Publish Date - Mar 28 , 2026 | 01:25 AM

నియోజకవర్గానికి రూ.3కోట్ల చొప్పున మంజూరు జాబితా పంపాలని ఎమ్మెల్యేలకు జలవనరులశాఖ మంత్రి లేఖ

చెరువులకు మహర్దశ
తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు

మదనపల్లె, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తోంది. జిల్లాల వారీగా చిన్న, మధ్యతరహా చెరువులు, ప్రాజెక్టులకు ప్రాధాన్యతిస్తోంది. గతేడాది మార్చిలోవంద ఎకరాలు, అంతకంటే ఎక్కువ సాగువిస్తీర్ణం గల చెరువులకు సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తోపాటు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకుంది. వీరి సారథ్యంలో మండలం, గ్రామాల వారీగా చెరువుల నిర్వహణ, మరమ్మతులు (ఆపరేషన్‌ ్క్ష మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) పథకం కింద చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక ఏడాదికి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రూ.3కోట్లు చొప్పున నిధులు మంజూరు చేసింది. పనులు చేపట్టే చెరువులు ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలకు ఇటీవల లేఖ రాశారు.

నియోజకవర్గానికి రూ.3కోట్లు

జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలకు రూ.3కోట్లు చొప్పున మంజూరు చేశారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు మండలాలు, గ్రామాల వారీగా పనులను ఎంపిక చేస్తున్నారు. వీటిని ఆయా మండలాల ఏఈ, జేఈల ద్వారా డివిజన్‌లోని ఈఈ నుంచి జిల్లాలోని ఎస్‌ఈ, అక్కడి నుంచి రాష్ట్రంలోని మైనర్‌ ఇరిగేషన్‌ విభాగం సీఈకి పంపుతున్నారు. గతేడాది ఈ పథకం కింద నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.60 కోట్ల నుంచి రూ.90 కోట్లు కేటాయించారు. తాజాగా ఈ ఏడాదికి నియోజకవర్గానికి రూ.3కోట్లు చొప్పున రాష్ట్రంలోని 26 జిల్లాలోని 175 నియోజకవర్గాలకు రూ.525కోట్లు కేటాయించడంతోపాటు సాగునీటి సంఘాలకు గుర్తింపునిస్తోంది.

చేపట్టాల్సిన పనులు ఇవీ..!

చెరువు కట్ట బలపరచడం, తూముల రిపేర్లు, పూడితకతీత పనులు, సప్లయ్‌ చానల్‌ మరమ్మతులు, నీటి ప్రవాహం సవ్యంగా సాగడానికి కాలువలు, చెరువుల్లో మొక్కలు, చెట్ల తొలగింపు పనులు చేపట్టనున్నారు. అలాగే నీటి నిల్వ, పంపిణీ సక్రమంగా జరగడానికి చెరువుల గండ్లు పూడ్చడం, సాగునీటి ప్రాజెక్టుల గేట్లు, షట్టర్లకు మరమ్మతులు, గ్రీసింగ్‌ తదితర అత్యవసర పనులు చేపట్టాల్సి ఉంది.

సాగునీటి సంఘాలకే ప్రాధాన్యం

పనులు చేపట్టడంలో సాగునీటి సంఘాలకే ప్రాధాన్యం ఇచ్చారు. మండలం, గ్రామంలో చెరువుల సంఖ్యను బట్టి ఒక్కో చెరువునకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల లోపు కేటాయించారు. రూ.10 లక్షల కంటే అనగా రూ.9.95లక్షలు విలువ వరకూ నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించగా, రూ.10లక్షలు దాటితే టెండర్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. సాగునీటి సంఘం ఎన్నికలు జరగని, చైర్మన్‌ లేని చెరువులకు రూ.5లక్షలలోపు ఉంటే గతంలోని ‘నీరు-చెట్టు’ పథకం తరహాలో నామినేషన్‌ పద్ధతిలో, అంతకుమించి దాటితే టెండర్‌ పిలవాలనే నిబంధన పెట్టారు.

జిల్లాలో 3,276 చెరువులు

మునుపటి జిల్లాలోని 30 మండలాల్లో 3,276 చెరువులు ఉండగా అందులో వంద ఎకరాలు, ఆపై సాగు విస్తీర్ణం ఉన్న చెరువులు 167 ఉన్నాయి. అలాగే మదనపల్లె డివిజన్‌లోని 15 మండలాల్లో 2,076 చెరువులు ఉండగా, 85 వంద ఎకరాలు, ఆపై ఆయకట్టు విస్తీర్ణం ఉన్న చెరువులు ఉన్నాయి. నియోజకవర్గంలోని మండలాల సంఖ్య, చెరువులను బట్టి నిధుల విభజనతో ఎంపిక చేస్తున్నారు. ఇదిలావుండగా, ఐదు వేల ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చెరువులను మైనర్‌ ఇరిగేషన్‌ కింద, ఐదువేల నుంచి 25వేల ఎకరాల లోపు ఉన్న చెరువులను మధ్య తరహా(మీడియం), 25వేల ఎకరాలకుపైబడిన చెరువును మేజర్‌ ఇరిగేషన్‌ కింద పరిగణిస్తున్నారు. అయితే గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు మధ్యతరహా ప్రాజెక్టు కాగా, ఇక తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు, నిమ్మనపల్లె మండలంలోని బాహుదా, పింఛా నదులూ మైనర్‌ కిందనే ఉన్నాయి.

Updated Date - Mar 28 , 2026 | 01:25 AM